ఫొటోగ్రఫీ వ్యాపారం
రెండు గ్రీకు పదాల కలయికతోనే ఫొటోగ్రఫీ అనే పదం ఏర్పడింది. ఫొటో అంటే చిత్రం, గ్రఫీ అంటే గీయమని అర్థం. ఫొటోగ్రఫీ అంటే కాంతితో చిత్రాన్ని గీయడం. 18వ శతాబ్దంలో పారిస్లో నలుపు తెలుపులతో ప్రారంభమైన ఫొటోగ్రఫీ కాలక్రమంలో రంగులు అద్దుకుంటూ కొత్తపుంతలు తొక్కుతోంది. డిజిటల్ సాంకేతిక విప్లవం ఫలితంగా ఇప్పుడది సెల్ఫోన్లో ఒదిగిన కెమరాలు, పాకెట్ కెమెరాల రూపాల్లో సామాన్యుడి చేతిలోకి చేరిపోయింది. ఫొటోగ్రఫీ.. ఇది జ్ఞాపకాల దొంతర్లను చిరస్థాయిగా నిలిపే ఛాయాచిత్రం. జీవిత కాలానికి సరిపడా స్మృతులను మన లైబ్రరీలో పదిలపరుస్తుంది. పండగలు, వేడుకలు, ఆనందాలు, విజయాలు, విషాదాలు,యుద్ధాలు, ప్రకృతి సోయగాలు, పరిణామక్రమం, దేశాల మధ్య ఒప్పందాలు, జంతుజాలం, పశుపక్ష్యాదులు.. ఇలా ఎన్నో అపురూపమైన, విశిష్ట సంఘటనలను గుర్తుకు తెచ్చే కెమెరా పనితనమే ఫొటోగ్రఫీ. వర్తమానానికి భవిష్యత్తుకి సాక్షిగా నిలుస్తున్న ఫొటోగ్రఫీ యువతకు చక్కటి ఉపాధి వేదికగా పరిణమించింది. సంప్రదాయ వివాహాలు, ఈవెంట్ దశలను దాటి.. ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ల ట్రెండ్ కొనసాగుతున్న తరుణంలో ఫొటోగ్రఫీ రంగంలో బోలెడు అవకాశాలు లభిస్తున్నాయి.
సందర్భం ఎటువంటిదైనప్పటికీ ఒక్క ఫొటో లక్ష పదాల కంటే బలమైన భావాన్ని వ్యక్తంచేస్తుంది. ఒకప్పుడు ఫొటోగ్రఫీ వివాహ వేడుకలు, ఈవెంట్స్కు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ, ఇప్పుడు దాని పరిధి పెరిగింది. నేటి డిజిటల్ యుగంలో ఫొటోగ్రాఫర్లకు అవకాశాలకు కొదవలేదు. యువత హాబీగా ఫొటోగ్రఫీ కోర్సులలో చేరి ఈ కళను ఆకళింపు చేసుకుని, దానిని ఆఫ్బీట్ కెరీర్గా మలచుకుంటోంది. ఈ–కామర్స్, ఫ్యాషన్, అడ్వర్టైజింగ్, జర్నలిజం, ట్రావెల్, టూరిజం, మాస్ మీడియా, స్పోర్ట్స్, వైల్డ్లైఫ్ తదితర అనేక రంగాలలో సృజనాత్మకత కలిగిన ఫొటోగ్రాఫర్లకు డిమాండ్ మరింతగా పెరుగుతోంది.
ఫ్రాన్స్కు చెందిన లూయిస్ జే.ఎం.డాగ్యూరే 1837లో ఫొటోగ్రఫీ ప్రాసెస్ను కనిపెట్టారు. అంతకు ముందు 1826లో ఫ్రాన్స్కు చెందిన జోసెఫ్ నైసిఫోరా నీప్సీ ఫొటోగ్రఫీ చరిత్రలో తొలిసారిగా ఛాయాచిత్రాన్ని రూపొందించారు. ఇంటి వెనుక పెరట్లో 8 గంటల పాటు ఛాయాచిత్రాన్ని సిల్వర్ అణువులు ఉన్న ప్లేట్పై బంధించారు. అయితే దానిని ఎక్కువ రోజులు నిల్వ చేయలేకపోయారు. 1839 జనవరి 9న ఫెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ డాగ్యూరే టైప్ ప్రాసెస్ను అధికారికంగా వెల్లడించింది. తర్వాత కొద్దినెలలకు 1839 ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం ఫొటోగ్రఫీపై పెటెంట్ హక్కులను కొనుగోలు చేసి దానిని ప్రపంచానికి కానుకగా అందించింది. అందుకే ఏటా ఆగస్టు 19ని ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంగా జరుపుతున్నారు. ఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫిక్ కౌన్సిల్ 1991 నుంచి మనదేశంలో ప్రతియేటా ఆగస్టు 19న ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించడం ప్రారంభించింది. మనదేశంలో 1857 వరకు కూడా ఫొటోగ్రఫీ అందుబాటులోకి రాలేదు. కేవలం బ్రిటీష్రాజు, జమిందారులు, సిపాయిలు మాత్రమే దీన్ని ఉపయోగించేవారు. 1877 నుంచి ఫొటోగ్రఫీ సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. భారతదేశంలో తొలిసారిగా లాలా దీనదయాళ్ ఫొటోగ్రఫీకి శ్రీకారం చుట్టారు.
డబ్బా మాదిరిగా పెద్దసైజులో…
ఫొటోగ్రఫీకి ప్రాణమైన కెమెరాలు మొదట్లో చాలా పెద్దసైజులో డబ్బా మాదిరిగా ఉండేవి. ఆ పరికరాల ధర తక్కువే అయినా మానవ కృషి, నైపుణ్యంపైనే ఫొటోగ్రఫీ ఆధారపడి కొనసాగేది. మొదట్లో ఎయిమ్ ఆండ్ షూట్ కెమెరాలు వాడుకలో ఉండేవి. ఇవి ఆకారంలో పెద్దగా ఉన్నా కొద్ది దూరంలోని వస్తువులను మాత్రమే కెమెరాలో బంధించగలిగేవి. తర్వాత ఫీల్డ్ కెమెరాలు ప్రవేశించాయి. ఇవే నల్లగుడ్డతో ముసుగు వేసుకొని ఫొటోలు తీసే కెమెరాలు. కేవలం రెండు ఫిల్ములు మాత్రమే ఉండటంతోపాటు, అవి కూడా పలకంత సైజులో ఉండటం వల్ల కేవలం రెండు ఫొటోలు మాత్రమే తీసేందుకు వీలుండేది. దీనివల్ల మోతబరువు తప్ప ఫొటోల నాణ్య త కూడా అంతంత మాత్రంగానే ఉండేది. ఆ తర్వాత టీఎల్ఆర్ (ట్వి న్లెన్స్ రిఫ్లెక్టర్) కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. మెడలో కెమెరా వేసుకొని కిందికి చూస్తూ, ఫొటోలు తీసేవారు. ఎస్ఎల్ఆర్ (సింగిల్ లెన్స్ రిఫ్లెక్టర్) కెమెరాలు వచ్చిన తర్వాత 35 ఫొటోలు తీసే సామర్థ్యం పెరిగింది. ఇందులో లెన్స్ మార్చుకునే సదుపాయం కూడా వచ్చింది. ఆ తర్వాత డిజిటల్ కెమెరాల రాకతో ఫొటోగ్రఫీకి నిర్వచనం పూర్తిగా మారిపోయింది. చిన్న సైజు మెమొరీ కార్డుతో వందలాది ఫొటోలు తీసే సామర్థ్యం, స్పష్టమైన రంగుల్లో అద్భుతమైన ఫొటోలు తీసే నైపుణ్యం అందుబాటులోకి వచ్చింది. వైడ్, టెలిలెన్స్ రెండింటికీ డిజిటల్ టెక్నాలజీ జోడించి ఛాయాచిత్రాలను నిమిషాల్లో అందజేసేందుకు ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతోంది.
పాస్‌పోర్ట్ సైజు ఫొటోల నుంచి ఫ్లెక్సీల వరకు
చదువులు, ఉద్యోగాల కోసం దిగే పాసుపోర్టు సైజు ఫొటోలు మొదలుకొని నిలువెత్తు సైజుల ఫ్లెక్సీవరకు ఫొటోగ్రఫీ కళ విస్తరించింది. కేవలం పట్టణ వాసులనే కాకుండా గ్రామీణులను సైతం ఫొటోగ్రాఫీ అమితంగా అలరిస్తోంది. ఫలితంగా ఇళ్లలో గోడలపై ఫ్రేములుగా, అల్బమ్ కవర్లలో ఉండాల్సిన ఫొటోలు వీధి వీధినా, గ్రామ గ్రామాన ఫ్లెక్సీ బోర్డులుగా కనిపిస్తున్నాయి. ఫొటోల మాదిరిగానే ఛాయాచిత్రకళ (ఫొటో గ్రఫీ) సైతం అనేక దశలు దాటి విజయవంతంగా ముందుకు సాగుతోంది. తలపై నల్లటి వస్త్రాన్ని ముసుగు వేసుకొని సూర్యకిరణాల ఆధారంగా తీసే ఫొటోల స్థానంలో క్షణాల్లో సాక్షాత్కరించే డిజిటల్ టెక్నాలజీ మన కళ్ల ముందు నిలిచింది. దానికి కంప్యూటర్ పరిజ్ఞానం కూడా తోడవడంతో ఫొటోగ్రఫీ ఎంతో సులభతరమయ్యింది.
పురుషులతో పాటు మహిళలకూ ఉపాధిమార్గం
ఒకప్పుడు ఫొటోగ్రఫీరంగంలో పురుషులు మాత్రమే ఉండేవారు. అయితే ప్రస్తుతం పురుషులతో సమానంగా మహిళలు కూడా ఈ రంగంపై మక్కువ పెంచుకుంటున్నారు. వెబ్ ఆధారిత సేవలు అందుబాటులోకి రావడంతో యానిమేషన్, ప్రచారం, మల్టీమీడియా, జియోస్పేషియల్, పాత్రికేయం, ఫ్యాషన్ రంగాల్లో ఫొటోగ్రఫీకి ఎనలేని డిమాండ్ ఏర్పడింది. మీడియా రంగంలో ఉన్న అవకాశాలు, స్వయం ఉపాధికి చక్కని వేదికగా ఉండటంతో పురుషులతో పాటు మహిళలు ఫొటోగ్రఫీలో రాణించడానికి అమితంగా ఇష్టపడుతున్నారు. కేవలం ఫొటోగ్రఫీనే వృత్తిగా ఎంచుకునే వారు కొందరైతే మరికొందరు సృజనాత్మకతను చాటుకునేందుకు ఫొటోగ్రఫీపై మక్కువ కనబరుస్తున్నారు. దేశంలో ఫొటోగ్రఫీ సంబంధిత రంగాల్లో విస్తృతమైన అవకాశాలున్నాయి. రోజుకో కొత్తదనాన్ని ఆస్వాదించే మెట్రో ఫ్యాషన్ రంగంలో ఫొటోగ్రఫీకి సంబంధించిన ఎక్కువ అవకాశాలు ఏర్పాడ్డాయి.
ఫొటోగ్రఫీ కోర్సులు
హైదరాబాద్లోని జేఎన్టీయూలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వెంకటేశ్వర ఫైనార్ట్స్ కళాశాల, లకోటియా ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్లు ఫొటోగ్రఫీలో శిక్షణనిస్తున్నారు. ఇవే కాకుండా పలు ప్రైవేట్ శిక్షణ కేంద్రాలు కూడా ఫొటోగ్రఫీలో శిక్షణ అందిస్తున్నాయి. జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగంలో ఫొటోగ్రఫీతో పాటు విజువల్ కమ్యూనికేషన్లో శిక్షణ అందిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందినవారెందరో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించారు. నాలుగేళ్ల ఫొటోగ్రఫీ కోర్సులో ఎనిమిది సెమిస్టర్లుంటాయి. 30 సీట్లను ప్రవేశపరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఫొటోగ్రఫీ, జనరల్ అవేర్నెస్, డ్రాయింగ్, కలరింగ్లపై ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. సాధారణంగా జూలైలో ప్రవేశాలు జరుగుతాయి ఆగస్టులో తరగతులుంటాయి. ఫ్యాషన్, పారిశ్రామిక, జర్నల్, పర్యాటకం, ట్రావెల్కు సంబంధించి ఫొటోగ్రఫీ, కంప్యూటర్ గ్రాఫిక్స్‌లో కూడా శిక్షణ ఉంటుంది.
ఫొటోగ్రఫీ కోర్సులు – అందిస్తున్న సంస్థలు
ఫిలిం, టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పుణె.
సింబయాసిస్ స్కూల్ ఆఫ్ ఫొటోగ్రఫీ, పుణె.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ ఆర్‌ట్స అండ్ యానిమేషన్, కోల్కత
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫొటోగ్రఫీ, ముంబై.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్.
ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఫొటోగ్రఫీ.
సర్ జేజే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్, ముంబై.
జామియా మిలీయా ఇస్లామియా, సెంట్రల్ యూనివర్సిటీ, న్యూఢిల్లీ.
జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీ, హైదరాబాద్.
సత్యజిత్రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ – కోల్‌కతా.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)-న్యూఢిల్లీ.
సెయింట్ జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్–ముంబై.
విద్యార్హతలు-వేతనాలు
ఫొటోగ్రాఫర్లుగా రాణించేందుకు ప్రత్యేకమైన విద్యార్హతలు అవసరం లేదు. అయితే సృజనాత్మకత చాలా ముఖ్యం. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హతతో డిప్లొమా, షార్ట్టర్మ్ సర్టిఫికెట్ కోర్సులకు నమోదు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో ఫొటోగ్రఫీ ఆప్షన్ సబ్జెక్టులుగా ఉన్నాయి. ఇవి పూర్తిచేస్తే పీజీ స్థాయి కోర్సుల్లోనూ చేరవచ్చు. ఫొటోగ్రఫీకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో ప్రైవేటు విద్యాసంస్థలు, ఇన్స్టిట్యూట్లు ఫొటోగ్రఫీ కోర్సులను అందిస్తున్నాయి. పదోతరగతి అర్హతతోనూ షార్ట్టర్మ్ కోర్సుల్లో చేరే అవకాశముంది. ఫొటోగ్రాఫర్ల వేతనం వివిధ రంగాల్లో వేర్వేరుగా ఉంటుంది. ప్రారంభంలో రూ.2 లక్షలు నుంచి రూ.3.5 లక్షల వార్షిక వేతనం అందుకునే అవకాశాలున్నాయి. అనుభవం, నైపుణ్యంతో వేతనాల్లో పెంపుదల ఉంటుంది. సొంతంగా ఫొటోగ్రఫీ వ్యాపారాన్ని ప్రారంభించి సంపాదన ఆర్జించే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈ నైపుణ్యాలు మీలో ఉంటే…
ఫొటోగ్రాఫర్గా రాణించాలనుకునే వారికి స్వతహాగా సృజనాత్మకత, ఎడిటింగ్ సాఫ్ట్వేర్ల పరిజ్ఞానం ఎంతో అవసరం. దీనితోపాటు కెమెరా పనితీరులో ముఖ్యమైన లైటింగ్, షేప్స్ ప్యాట్రన్స్, కంటిచూపు, ఫొటోగ్రాఫిక్ దృష్టి లాంటి నైపుణ్యాలు కలిగిఉండాలి. ఫొటోలను అందంగా చూపడంలో కీలక పాత్ర పోషించే బ్యాక్గ్రౌండ్ కలర్స్, లైటింగ్, అపెక్చర్ వంటి అంశాల్లో చక్కని అవగాహన కూడా అవసరం. సాంకేతికంగా ఈ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి.
అవకాశాలు..
ఫొటోగ్రఫీ కోర్సుచేసిన వారికి అవకాశాలకు కొదవలేదు. సృజనాత్మకత, నైపుణ్యాల ఆధారంగా వృత్తిలో త్వరగా ఎదిగే వీలుంది. ఫొటో జర్నలిస్ట్లకు వివిధ పత్రికలు, టీవీ ఛానెళ్లల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఎంచుకున్న స్పెషలైజేషన్‌ను అనుసరించి ఎలక్ట్రానిక్ మీడియా, సినిమా నిర్మాణ సంస్థలు, టీవీ ప్రొడక్షన్ హౌసెస్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు,ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, సైంటిఫిక్ జర్నల్స్, ఫ్యాషన్ హౌస్లలో అవకాశాలు అందుకోవచ్చు. ప్రధానంగా వన్యమృగాల(వైల్డ్లైఫ్) ఫొటోగ్రఫీకి అమితమైన ఆదరణ ఉంది. ప్రకృతి ఒడిలో జంతు, పక్షిజాలాన్ని అందంగా.. వివిధ కోణాల్లో ఎవరూ తీయని విధంగా ప్రత్యేకంగా ఫొటోలు తీయగలిగితే ఎంతో గుర్తింపు లభిస్తుంది. అరుదైన పక్షులు, జంతువుల ఫొటోలు తీయగలిగితే ఉత్తమ ఫొటోగ్రాఫర్గా పేరు సంపాదించుకోవచ్చు. అయితే ఇందుకోసం కొండంత సహనం అవసరం. జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్న పార్కులు, కీకారణ్యాలు, అభయారణ్యాల్లో అద్భుతమైన ఫొటోలు తీసి జర్నల్స్లో ప్రచురించటం, ఎగ్జిబిషన్స్లో ప్రదర్శించడం ద్వారా పేరుతోపాటు డబ్బు కూడా గడించవచ్చు. సాహసోపేతమైన జీవితం గడపాలనుకునే వారికి వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ సరిగ్గా సరిపోతుంది. వీరు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్, యానిమల్ ప్లానెట్, డిస్కవరీ ఛానెల్లాంటి అంతర్జాతీయ మీడియా హౌస్లలో సైతం పనిచేసే అవకాశాలున్నాయి.
సొంతంగా రాణించాలంటే
ఫొటోగ్రాఫర్స్గా ఉద్యోగంలో కంటే సొంతంగా రాణించే వారి సంఖ్యే అధికంగా ఉంటుంది. వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్లుగా మంచి పేరు సంపాదించుకుంటే.. సొంతంగా స్టూడియో నిర్వహించుకుంటూ ఆర్జించవచ్చు. ఇటీవలి కాలంలో డిజిటల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో ప్రొడక్ట్ ఫొటోగ్రఫీకి డిమాండ్ అధికంగా కనిపిస్తోంది. దుస్తులు, షూస్, బ్యాగులు, అలంకరణ వస్తువులు, కార్లు, వాహనాలు తదితర ఈ–కామర్స్ వెబ్సైట్స్లో ఉత్పత్తుల ఫొటోలు తీయడానికి ప్రొడక్ట్ ఫొటోగ్రాఫర్ల అవసరం అధికంగా ఏర్పడింది. ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో భాగంగా మోడల్స్ సంఖ్యకు అనుగుణంగా ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్లకూ డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. వీరికి ఆకర్షణీయమైన వేతనాలు ఇస్తున్నారు. మనదేశానికి చెందిన ఆదర్శ్ ఆనంద్, అకాశ్ దాస్, అమిత్ మెహ్రా, ఆనంద్ శరణ్ మొదలైన ఎంతో మంది ఉత్తమ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్స్గా పేరొందారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల హడావుడి పెరుగుతున్న నేపథ్యంలో నిపుణులైన ఫొటోగ్రాఫర్ల అవసరం మరింతగా పెరిగింది. అలానే, ఫ్యాషన్ మ్యాగజైన్స్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్లను ప్రత్యేకంగా నియమించుకుంటున్నాయి. ముఖ్యంగా ఫ్రీలాన్సింగ్ అనేది ప్రముఖ కెరీర్ ఆప్షన్లల్లో ఒకటిగా మారిపోయింది. బిజినెస్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు ఉన్నవారు ఫ్రీలాన్సింగ్లో స్థిరపడొచ్చు. ప్రముఖ వెబ్సైట్లకు ఫొటోలు తీసి పంపించడం ద్వారా రాయల్టీ ఆదాయం పొందవచ్చు.
ఫొటోగ్రఫీలో వివిధ రకాలు
వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ ఫొటోగ్రఫీ, ల్యాండ్స్కేప్ ఫొటోగ్రఫీ, ఏరియల్ ఫొటోగ్రఫీ, పెట్ ఫొటోగ్రఫీ, ఈవెంట్ ఫొటోగ్రఫీ, ఆస్ట్రో ఫొటోగ్రఫీ, ఫొటో జర్నలిజం, యాక్షన్/స్పోర్ట్స్ ఫొటోగ్రఫీ, ఆర్కిటెక్చరల్ ఫొటోగ్రఫీ, వెడ్డింగ్ ఫొటోగ్రఫీ, మాక్రో ఫొటోగ్రఫీ, ఫ్యామిలీ ఫొటోగ్రఫీ, ప్రొడక్ట్ ఫొటోగ్రఫీ, స్టాక్ ఫొటోగ్రఫీ… వంటి విభిన్న రకాలను ఫొటోగ్రఫీ కెరీర్లు ఎంచుకునే అవకాశముంది.