పాన్షాప్ ప్రారంభించడమెలా?
మన సంస్కృతి లో తమలపాకుకు ఉన్న ప్రాధాన్యత అందరికి తెలిసిందే. గణేశ స్థాపనలో, కలశస్థాపనలోను అన్ని పూజలలో తమలపాకులకే అగ్రస్థానం అందుతుంది. ఇంటికి వచ్చిన అతిథికి చేసే మర్యాదలలోనూ తమలపాకు తప్పనిసరిగా ఉండాలంటారు. తమలపాకులను కిళ్ళీలుగా కూడా చాలామంది నములుతూ వుంటారు. ఇంతటి ఘన చరిత్ర గల తమలపాకులో ఎన్నో ఆరోగ్యాలకు సంబందించిన రహస్యాలు దాగి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మిరియపు జాతికి చెందిన తమలపాకు మనదేశంలో పుట్టింది కాదు.. మలేసియా నుండి దిగుమతి అయ్యింది. తీగ జాతికి చెందిన ఈ మొక్క ఉష్ణ దేశాలలో ఏపుగా పెరుగుతుంది. జీర్ణక్రియ వ్యవస్థను క్రమబద్దికరించి ఆహారాన్ని తేలిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది. భోజనం తరువాత తమలపాకు వేసుకోవటం ఈనాటికీ చాలామందికి ఉన్న తప్పనిసరి అలవాటు. తలనొప్పి, పంటి నొప్పి, చిగుళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పులు తమలపాకును వాడితే క్రమంగా తగ్గుతాయి. తమలపాకు సేవనం అధిక రక్తస్రావాన్ని అరికడుతుంది. తమలపాకు కాడలను ఉప్పువేసి దంచి రాసుకుంటే పంటి నొప్పి వెంటనే తగ్గుతుందని చైనా థాయ్లాండ్ దేశాలలోని ప్రజలు నమ్ముతారు. తమలపాకు, వక్క కలిపి తింటే దగ్గుని, అస్తమాని తగ్గిస్తుందని ఇండోనేషియావాసుల నమ్మకం. ఈ తమలపాకులో ‘ఎ’ విటమిన్ ఉండటం వలన దీని సేవనం కంటి చూపుకు ఎంతో సహాయ కారిగా మారుతుంది. కలకత్తాలో, వారణాసిలో దొరికే తమల పాకులు పెద్దగా, దళసరిగా ఉంటూ మంచి రుచి కలిగి ఉంటాయి. లేత ఆకు పచ్చరంగులో గాని ముదురు ఆకుపచ్చ రంగులో గానీ ఈ ఆకులు ఉంటాయి. 15 నుంచి 20 సెంటిమీటర్ల పొడవు కలిగి ఉంటాయి.
భారతదేశం అనేక సంప్రదాయాలకు నిలయం. భోజనం చేసిన తరువాత పాన్ తీసుకోవడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. హిందూ ఆచారాలలో తమలపాకును శుభప్రదంగా భావిస్తుంటారు. అదృష్ట చిహ్నంగా కూడా |భావిస్తుంటారు. దుర్గా పూజ, దీపావళి తదితర పండుగల సందర్భాలలో తమలపాకులను అత్యధికంగా వినియోగిస్తుంటారు. మతపరమైన పూజలు కర్మలు చేసేటప్పుడు కూడా తమలపాకును వినియోగిస్తారు. పాన్ను తక్కువ మొత్తంలో తీసుకోవడం వలన ఆహారం సులభంగా జీర్ణమవడానికి సహాయపడుతుందని మెడికల్ సైన్స్ చెబుతోంది. ఒకప్పుడు పాన్ రాయల్టీకి చిహ్నంగా ఉండేది. మాఘై పాన్, సాదా పాన్, మీఠాపాన్, బనారసి పాన్, సిల్వర్ పాన్, గోల్డ్ పాన్, రస్మలై పాన్, చాక్లెట్ పాన్, బంగ్లా పాన్, తంబకు పాన్, మిస్తీ పాన్, జగన్నాథ్ పాన్, కలకత్తా పాన్ వంటి అనేక రకాల పాన్లు ప్రజాదరణ పొందాయి. వీటిలో సాంప్రదాయికమైనవి కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ అనాలిసిస్ రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ గ్రూప్ గణాంకాల ప్రకారం దేశీయ పాన్ మరియు పాన్ మసాలా పరిశ్రమ ఏటా 9 శాతం మేరకు పెరుగుతోంది.
నిధులను ఏర్పాటుచేసుకోండిలా…
ఇది పాన్ షాపు ఏర్పాటు చేసేందుకు ముందుగా చేయవలసిన పని. ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు మీ దగ్గర తగినంత నిధులువుంటే సరిపోతుంది. లేని పక్షంలో ఈ వ్యాపారానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న స్పాన్సర్లను గుర్తించండి.
తగిన ప్రాంతంలో ఏర్పాటు చేయండి
కాలనీల దగ్గర పాన్షాపు ఏర్పాటు చేయడం వలన మీకు లాభం రాదు. పాన్షాప్ వ్యాపారాన్ని స్థాపించడానికి ఉత్తమమైన స్థలం రెస్టారెంట్ లేదా ఫ్యామిలీ డైనింగ్, ఆఫీసులు, మార్కెట్లు, నిర్మాణ స్థలం దగ్గర లేదా ఫుట్ఫాత్ మొదలైనవి. ప్రజలు విరామం కోరుకునే సందర్భాలలో పాన్ స్టాల్కు వస్తుంటారు.
లైసెన్స్ మరియు అనుమతి
భారతదేశంలో ఏదైనా దుకాణాన్ని ఏర్పాటు చేయడానికి మీరు బిజినెస్ లైసెన్స్, విక్రయ సర్టిఫికేట్, బిజినెస్ నేమ్ రిజిస్ట్రేషన్ లేదా డిబిఎ సర్టిఫికేట్, సర్టిఫికేట్ ఆఫ్ ఆక్యుపెన్సీ, ఫెడరల్ టాక్స్ ఐడి వంటి అనుమతులను తీసుకోవాలి. అదేవిధంగా పాన్ షాప్ ఏర్పాటు చేయడానికి లైసెన్స్ తప్పనిసరి. వీటికోసం ముందుగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సివుంటుందని గుర్తుంచుకోండి.
మౌలిక సదుపాయాలు
పాన్ షాప్ వ్యాపారం అనేది ఎటువంటి ఉన్నత స్థాయి మౌలిక సదుపాయాలను డిమాండ్ చేయదు. ఇది తక్కువ నిధులు మరియు తక్కువ సరంజామా కలిగిన వ్యాపారం. మీకు కావలసిందల్లా కియోస్క్, కౌంటర్, కొన్ని అల్మారాలు అవసరమవుతాయి. మీరు మీ పాన్ దుకాణాన్ని రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా రద్దీగా ఉంగే ఒక చిన్న స్థలంలో ఏర్పాటు చేయవచ్చు. పెద్ద గొడుగు కింద కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దానికింద కొన్ని చిన్న బల్లలు లేదా కుర్చీలను వేసుకోవాల్సి ఉంటుంది.
కావలసిన సామగ్రి
మీరు పాన్ షాప్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీకు ప్రధాన పెట్టుబడి అందుకు అవసరమైన పరికరాలు. తమలపాకులు, స్నాక్స్ మొదలైనవి ఉంచడానికి మీరు కొన్ని జాడీలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఉత్పత్తులు రోజంతా తాజాగా ఉండటానికి మీరు ఒక చిన్న శీతలీకరణ యూనిట్ను కూడా ఏర్పాటు చేసుకోవాల్సివుంటుంది. ఇవన్నీ తక్కువ ఖర్చుతో కూడిన పెట్టుబడులుగానే ఉంటాయి.
ముడిసరుకును అమర్చండి
పాన్ షాప్ వ్యాపారానికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు. పాన్ తయారు చేయడానికి ఉపయోగించే ఉత్పత్తులు చౌకగానే లభ్యమవుతాయి. మరియు మార్కెట్లో సులభంగా లభిస్తాయి. మీరు ప్రతిరోజూ తమలపాకులను కొనుగోలు చేసేందుకు సంబంధిత డీలర్లతో టచ్లో ఉండండి. ఈ విషయంలో అజాగ్రత్త ఉంటూ లాభాలను దూరం చేసుకోకండి. పాన్ వ్యాపారం చేసేవారు దాని తయారీకి ఎల్లప్పుడూ మార్కెట్లో దొరికే సరసమైన ఉత్పత్తుల కోసం చూస్తుండాలి.అయితే నాణ్యత విషయంలో రాజీపడకూడదు. మీరు కొనుగోలు చేసే ఉత్పత్తులు గడువు తేదీని దాటలేదని నిర్ధారించుకోండి. మరియు మీ పాన్ షాప్ చుట్టుపక్కల ప్రాంతం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి.
వెరైటీ కోసం వెళ్ళండి
ప్రాథమిక పాన్తో పాటు, మీరు రకరకాల పాన్లను అందుబాటులో ఉంచవచ్చు. స్వీట్ పాన్, ఫైర్పాన్, పుదీనా పాన్, వంటి చాలా రకాల పాన్లకు మంచి డిమాండ్ ఉంది. జనం ఈ ఈ పాన్లకు కూడా అలవాటు పడ్డారు. వీటిని అధికంగానే కొనుగోలు చేస్తుంటారు. పాన్లను పలు అందుబాటులో ఉన్న పదార్ధాలను ఉపయోగించి తయారు చేస్తుంటారు కాబట్టి దీనికి అదనపు ఖర్చు కూడా అవదు.
చిరుతిళ్లు కూడా…
పాన్కు తగినంత డిమాండ్ ఉన్నప్పటికీ కాలక్రమేణా అది వినియోగించే విధానం మారిపోయింది. ఇప్పుడు పాన్ షాపులకు కొత్త అర్ధం వచ్చింది. ఇక్కడ పాన్ మాత్రమే కాకుండా సిగరెట్లు, పాన్ మసాలాలు కూడా విక్రయిస్తున్నారు. అలాగే చిప్స్ మరియు స్నాక్స్ కూడా ఈ దుకాణాలలో ఉంచుతున్నారు. బిస్కెట్లు, పఫ్స్ లేదా క్రీమ్ రోల్స్, చిప్స్ వంటి ఇతర స్థానిక బేకరీ వస్తువులు కూడా ఉంచుతున్నారు.
పాన్షాప్ బిజినెస్ భారతదేశంలో అసంఘటిత వ్యాపార రంగంలో ఒక హైలైట్గా నిలుస్తుంది. చాలామంది తమ ఉద్యోగాలను విడిచిపెట్టి గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి పాన్ షాపులను ఏర్పాటు చేయడం చూస్తున్నాం. ఈ వ్యాపారాన్ని తక్కువగా చూసే రోజులు పోయాయి. ప్రభుత్వం యువతను స్వయం ఉపాధిపై ఆధారపడాలని చెబుతుండటంతో ఈ వ్యాపారానికి కూడా ఆదరణ దక్కుతోంది. చాలా మంది పాన్షాప్లను ఏర్పాటుచేసి, పెద్దస్థాయికి కూడా దీనిని తీసుకువెళ్లారు.
హైదరాబాద్లోని పాన్మండీకి వందేళ్ల చరిత్ర
భాగ్యనగరంలో నిజాం నవాబుల కాలం నుంచే తమలపాకుల వినియోగం ఉంది. ఆ రోజుల్లో పాన్షాప్లు నగరంలో అందుబాటులో ఉండేవి కావని చెబుతుంటారు. నవాబులు, ఉన్నత వర్గాలు, ధనికుల ఇళ్లలో పాన్దాన్లు ఉండేవి. పాన్దాన్ అంటే తమలపాకులతో పాటు వక్కలు, సోంపు, సున్నం, కాసుతో పాటు ఇలాచీ, లవంగం ఉండే చిన్నపాటి పెట్టె అని చెబుతారు. ఏదైనా విందు జరిగిన సందర్భాలతో ఇంటికి వచ్చిన చుట్టాలకు ఆహారపానీయాల అనంతరం నమలడానికి తమలపాకులు తప్పకుండా అందించేవారు. ఇలా నగరంలో ఎన్నాళ్లనుంచో తమలపాకులు వినియోగం జరుగుతోంది.
మొజాంజాహి మార్కెట్లో..
నిజాంల కాలంలో పాన్ విక్రయాల కోసం పాన్మండీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో 1919లో పాన్ విక్రయాలకు అనుమతించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. మొజాంజాహి మార్కెట్ ప్రాంతంలో పాన్మండీ ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం. అప్పట్లో నల్లగొండ, రంగారెడ్డి ప్రాంతాల పాటు ఇతర ప్రాంతాల నుంచి ఎడ్లబండ్లపై వివిధ రకాల నిత్యావసర వస్తువులు ఇక్కడికు తరలి వచ్చేవి. అప్పట్లో ఆ ప్రాంతమంతా మైదానంగా ఉండేది. నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా సమీపంలోనే ఉండడంతో పాన్మండీ ఇక్కడే ఏర్పాటైందని చెబుతుంటారు. పాన్మండీ 1962 వరకు ఇక్కడే కొనసాగిందని, అనంతర కాలంలో దీనిని దారుస్సలాంనకు మార్చినట్లు పాన్మండీ నిర్వాహకులు చెబుతుంటారు.
దిగుమతుల ఇలా…
పాన్మండీకి తమలపాకులు పెద్ద పెద్ద బుట్టల్లో దిగుమతి అవుతుంటాయి. కడప జిల్లా నుంచి అత్యధికంగా ఇక్కడికి తమలపాకులు వస్తుంటాయి. మహారాష్ట్ర నుంచి కూడా కొంత మొత్తంలో ఈ మార్కెట్కు దిగుమతి అవుతాయి. పాన్ షాపుల యజమానులు, కేటరింగ్ చేసే వారితో పాటు పాన్ విక్రయించే వారు కూగా ఇక్కడి నుంచే తమలపాకులను కొనుగోలు చేస్తుంటారు. ఒక్కో బుట్టలో 2 వేల నుంచి 2,500 తమలపాకులుంటాయి. ఒక్కో బుట్టలో తమలపాకుల నాణ్యతను బట్టి రూ.450 నుంచి రూ.650 వరకు ధర పలుకుతుంది. ఎండాకాలంలో ధరలు పెరుగుతుంటాయి.
వారానికి మూడు రోజులే..
దారుస్సలాం పాన్ మార్కెట్లో వారానికి మూడురోజులు మాత్రమే తమలపాకుల వ్యాపారం కొనసాగుతుంటుంది. సోమ, బుధ, శుక్రవారాల్లో వ్యాపార లావాదేవీలు ఉంటాయి. నగరంలోని పాన్ షాప్లకే కాకుండా ఇతర జిల్లాలకు కూడా తమలపాకులు సరఫరా అవుతుంటాయి. గతంలో నగర శివారుతో పాటు నల్లగొండ, మెదక్ జిల్లాల నుంచి కూగా తమలపాకులు నగర మార్కెట్కు దిగుమతవుతుంటాయి. గతంలో తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలకు ఇక్కడి నుంచే తమలపాకులు ఎగుమతయ్యేవి. ప్రస్తుతం అన్ని జిల్లాలలో పాన్మండీలు విరివిగా ఏర్పాటయ్యాయి. ఈ మండీల నిర్వాహకులు నేరుగా తమలపాకులను దిగుమతి చేసుకుంటున్నారు. తెలంగాణలో దారుస్సలాం పాన్ మార్కెట్ ఎంతో పేరు పొందింది. తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఇక్కడి నుంచే తమలపాకులు సరఫరా అవుతాయి. పాన్షాప్లు, తమలపాకుల ద్వారా హైదరాబాద్ నగరంలో 25 వేల మంది ఉపాధి పొందుతున్నారు. నగరంలో ప్రతీరోజూ 25 లక్షల తమలపాకుల వినియోగమవుతున్నాయనేది ఒక అంచనా.