టెక్స్టైల్ వ్యాపారాన్ని ప్రారంభించడం ఎలా?
టెక్స్టైల్స్ అనగానే అందరూ ఫ్యాషన్ డిజైనింగ్ అని అనుకుంటుంటారు. అయితే టెక్స్టైల్స్ పరిశ్రమకు అనుబంధంగా కొనసాగుతున్న ఫ్యాషన్ డిజైనింగ్‌కు ఇప్పుడు విశేషమైన ఆదరణ లభిస్తోంది. అయితే టెక్స్టైల్స్ మేనేజ్మెంట్లో పలు ఉపాధి, ఉద్యోగావకాశాలున్నాయి. ఫ్యాబ్రిక్ వర్క్, మగ్గం వర్క్, క్లాత్ డిజైనింగ్, రీసెర్చ్, సూపర్వైజింగ్ ఇలా చాలా విభాగాలు టెక్స్టైల్ వ్యాపారంలో ఉన్నాయి. వాణిజ్యపరంగా హై పొటెన్షియల్ కలిగిన ఇండియాలో టెక్స్టైల్స్ పరిశ్రమ పరిధి రోజురోజుకూ మరింతగా విస్తృతమవుతోంది. అదే రీతిలో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. సాధారణ కార్మికులు మొదలుకొని డిజైనింగ్, మేకింగ్, మార్కెటింగ్, మేనేజ్మెంట్ ఇలా రకరకాల సెక్టార్లలో కొలువులు, ఉపాధి అవకాశాలు దండిగా లభిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా పలు కళాశాలలు, యూనివర్సిటీలు టెక్స్టైల్ ఇండస్ట్రీకి అనుగుణంగా నూతన కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. భారతదేశంలోని టెక్స్టైల్ పరిశ్రమ ఇప్పుడు ప్రపంచస్థాయి ఇండస్ట్రీగా ఎదిగింది. నూలు వస్త్ర ఉత్పత్తిలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. ఊలు దుస్తుల ఉత్పత్తిలో ప్రపంచంలో ఏడో స్థానంలో ఉంది. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎంతగానో విస్తరించింది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి.
మానవ జీవితంలో వస్త్రాలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా అని చెప్పలేం. రోజువారీ జీవితంలో వస్త్రాలు లేని జీవితాన్ని మనం అస్సలు ఊహించలేం. ప్రాచీన కాలం నుంచి భారతీయ వస్త్ర పరిశ్రమకు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రస్తుత కాలంలో ఈ పరిశ్రమ అత్యధిక మందికి ఉపాధిని కల్పించడంతో పాటు దేశానికి అధిక ఆదాయాన్ని సమకూరుస్తోంది. ప్రపంచంలో నాణ్యమైన బట్టలను ఉత్పత్తి చేయడంలో భారతదేశానికి మంచి పేరుంది. ఈ అంశమే ప్రపంచంలోని నలుమూలల ఉన్న వ్యాపారుల దృష్టిని భారత్‌వైపు ఆకర్షించింది. సింధూ నాగరికత, మొఘలుల కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకూ దేశ వాణిజ్యంలో వస్త్ర పరిశ్రమకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
దేశ ఆర్థిక రంగంలో వస్త్ర పరిశ్రమకు ప్రముఖ స్థానం ఉంది. దేశంలో వస్త్ర పరిశ్రమ ద్వారా నేరుగా 4 కోట్ల 50 వేల మంది ఉపాధి పొందుతున్నారు. సంబంధింత అనుబంధ రంగాల్లో 6 కోట్ల మందికి పైగా ప్రజలు పనిచేస్తున్నారు. భారతదేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో వ్యవసాయ రంగం మొదటి స్థానంలో ఉండగా, వస్త్రపరిశ్రమ రెండోస్థానంలో ఉంది. వస్త్ర పరిశ్రమ మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో 14 శాతం పారిశ్రామిక ఉత్పత్తికి వస్త్రపరిశ్రమ తోడ్పాటును అందిస్తోంది. జాతీయ తలసరి ఆదాయంలో 4 శాతం, ఎగుమతుల్లో 12 శాతం ఆదాయాన్ని కల్పిస్తోంది. దేశంలో వస్త్ర పరిశ్రమ ద్వారా 27 శాతం విదేశీ మారక ద్రవ్యం అందుతోంది. సహజ ఉత్పత్తులైన పీచు, జనపనార, పత్తి, సిల్క్, ఉన్ని, కృత్రిమంగా మనుషులు తయారు చేసే పాలిస్టర్, నైలాన్, అక్రిలిన్లు దేశంలో వస్త్ర పరిశ్రమ ఉత్పత్తికి ప్రాథమిక బలంగా నిలిచాయి. ప్రపంచంలోని నూలు, వస్త్ర పరిశ్రమ ఉత్పత్తుల్లో భారతదేశం 14 శాతం వాటాను కలిగివుంది.
మారుతున్న వస్త్ర పరిశ్రమ స్వరూపం
వస్త్ర పరిశ్రమను అత్యంత సంక్లిష్టమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పత్తి ఉత్పత్తి నుంచి నాణ్యమైన బట్టను తయారు చేసే వరకూ అనేక దశలు దాటాల్సివుంటుంది. ప్రైవేటు రిటైల్ సంస్థలను బట్టి బట్టల నాణ్యత, సైజు వగైరాలు మారుతుంటాయి. ప్రస్తుతం దేశంలో వస్త్ర పరిశ్రమలు వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని నడుస్తున్నాయి. అధికశాతం రిటైల్ సంస్థలు సొంత తయారీ యూనిట్లను నెలకొల్పుకున్నాయి. వారి సొంత బ్రాండింగ్‌తో ముందుకు వెళుతున్నాయి. వస్త్రపరిశ్రమ వర్గాలు కేవలం దుస్తులనే కాకుండా ఇళ్లలో ఉపయోగించే ఇతర వస్తువులైన కర్టెన్లు, టవళ్లు వంటి వాటి ఉత్పత్తికి ప్రాముఖ్యతను ఇస్తున్నాయి.
వస్త్ర పరిశ్రమలో కెరీర్ అవకాశాలు
వస్త్ర పరిశ్రమకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోనూ అపారమైన అవకాశాలున్నాయి. ఈ రంగంలో పరిజ్ఞానం ఉన్న వారికి కెరీర్‌కు ఎటువంటి ఢోకా లేదు. ఈ రంగంలో రాణించాలనుకునే విద్యార్థులు సాంకేతిక నైపుణ్యం, విద్యాపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. అప్పుడు ఆయా కంపెనీలు వారిని తమ సంస్థలలోకి ఉద్యోగాల్లో తీసుకుంటారు. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిపుణులు త్వరగా కెరీర్లో ఉన్నతస్థితికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ రంగం వారికి భవిష్యత్‌లో వ్యాపారం, సేవా రంగాల్లోకి వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉన్న వారిని ప్రైవేట్ కంపెనీలు మంచి జీతాలతో ఆఫర్లు అందిస్తున్నాయి. వీరు కొత్త వస్తువుల ఉత్పత్తి, యంత్రాల మెయింటనెన్సు, క్వాలిటీ కంట్రోల్, ఉత్పత్తి, అమ్మకాలు, మార్కెటింగ్ చేయడం తదితర విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ రంగంలో…
ఈ రంగంలో అభిరుచి, నిపుణత కలిగినవారికి ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, బ్రిటీష్ ఇండియన్ కార్పొరేషన్(బిఐసి) దాని సబ్సిడరీలల్లో, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఒ), బర్డ్స్ జూట్ ఎక్స్‌పోర్టు లిమిటెడ్(బిజెఈఎల్)- కొల్కతా,కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ)- ముంబయి, హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్హెచ్ఇసి),-న్యూఢిల్లీ, నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ (ఎన్‌టిసి) తదితర సంస్థలలో ఉద్యోగావకాశాలున్నాయి.
విద్యాసంస్థల్లో..
సెంట్రల్ సిల్క్ బోర్డు, టెక్స్టైల్ కమిటీ, నేషనల్ జూట్ బోర్డ్స్, ఇండియన్ ఇనిస్టిట్టూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ(ఐఐటిడి), నేషనల్ ఇనిస్టిట్టూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్), సర్దార్ వల్లభారు ఇన్స్టిట్టూట్ ఆఫ్ టెక్స్టైల్ మేనేజ్మెంట్(కొయంబత్తూర్) మొదలైనవి టెక్స్టైల్ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తున్నాయి. అలాగే వివిధ యూనివర్సిటీలు టెక్స్లైల్స్కు సంబంధించిన యూజీ, పీజీ, పీహెచ్డీ ప్రోగ్రామ్స్‌ను, టెక్నాలజీ, ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, ప్రాసెసింగ్, ఫైబర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులను అందిస్తున్నాయి. బీటెక్‌లో చేరడానికి ఇంటర్(10+2) ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఎంఈ/ఎంటెక్‌లో చేరాలంటే బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతోపాటు గేట్ ఉత్తీర్ణులై ఉండాల్సివుంటుంది.
భవిష్యత్‌కు భరోసా
అభివృద్ధి చెందుతున్న రంగాల్లో వస్త్రపరిశ్రమ ముందుంది. భారతీయ వస్త్ర పరిశ్రమ మార్కెట్ 2021నాటికి 221 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఈ రంగంలో ఎఫ్‌డీఐలకు అనుమతి ఇవ్వడంతో ఈ పరిశ్రమలోని వారు వివిధ రకాల బ్రాండ్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్‌లో ఈ రంగం మరిన్ని ఉద్యోగవకాశాలను కల్పిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే నూతనంగా వస్త్రపరిశ్రమను నెలకొల్పాలన్నా, వస్త్ర దుకాణాన్ని తెరవాలన్నా కొన్ని అంశాలను గుర్తుంచుకోవాలి.
-
మార్కెట్ గురించి తెలుసుకోండి
వస్త్ర పరిశ్రమకున్న మార్కెట్ గురించి మరియు అది ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి ఇప్పటికే వ్యాపారంలో ఉన్నవారి నుండి సలహాలు తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది. అయితే దీనికి ముందుగా మీరు మరికొన్ని అంశాలను కూడా గుర్తుంచుకోవాలి.
-
a) ఉత్పత్తి డిమాండ్
మీరు వస్త్రాలను విక్రయించడానికి ప్లాన్ చేస్తున్నప్పుడు నిర్దిష్ట రకం ఫాబ్రిక్‌కు ఉన్న డిమాండ్ యొక్క నాణ్యతను అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. వస్త్రాలకు డిమాండ్ ప్రతిచోటా ఒకేలా ఉండకపోవచ్చు, కాబట్టి మీరు దానిని నిర్ణయించడానికి ప్రాంతాల వారీగా సర్వే చేయాలి.
బి) పోటీ
మీరు దుకాణం ఏర్పాలు చేసే ప్రాంతంలో మీరు విక్రయించాలనుకుంటున్న సారూప్య ఉత్పత్తులను విక్రయించే మరొక స్టోర్ ఉంటే, వాటిని అధిగమించడానికి మీరు ఏమి చేయగలరో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి
సి) ధర
ఏ రకమైన వ్యాపారంలోనైనా ధర అనేది ముఖ్యమైన అంశం. మీ ఉత్పత్తులను సాధ్యమైనంత పోటీ ధర నిర్ణయించడానికి ప్రయత్నించండి.
-
పరిశోధన
మీ వస్త్ర వ్యాపారం విజయవంతమైన వెంచర్‌గా ఉండాలని మీరు కోరుకుంటే, మంచి పరిశోధన ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేయకండి. అలాగే మీరు మీ కస్టమర్లను అర్థం చేసుకోవాలి. వారు ఏమి కోరుకుంటున్నారు? మరియు మీ పోటీదారులు ఏమి చేస్తున్నారో కూడా తెలుసుకోవాలి. వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించేందుకు కావలసిన మూలధనం, ఇందుకోసం చేసే ఏర్పాట్లు, మీ వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు మీరు తీసుకోవలసిన చర్యలు, మీ వ్యాపారానికి అవసరమైన లైసెన్స్ తీసుకోవాలి.
-
విక్రేతలతో కనెక్ట్ అవ్వండి
మీరు వస్త్ర ముద్రణ లేదా ఉత్పత్తికి సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, ఇందుకోసం అవసరమైన ముడి పదార్థాలను సరఫరా చేసే విక్రేతల వివరాలు తెలుసుకుని వారిని సంప్రదించాలి.
-
నిపుణులను సంప్రదించండి
మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఫాబ్రిక్ రకాన్ని నిర్ణయించడానికి తయారీదారులను మరియు విక్రేతలను తప్పనిసరిగా సంప్రదించాలి. నాణ్యత కలిగిన బట్టలు లేదా సంబంధిత వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇందుకోసం మీరు కొన్ని ప్రత్యేకమైన బట్టల అవుట్లెట్లు సందర్శించాలి లేదా స్థానిక నేత చేతివృత్తులవారిని కూడా కలుసుకోవాలి. ఇటువంటి ప్రయత్నాలు మీ వ్యాపారానికి మేలును చేకూరుస్తాయి.
-
నగదు ప్రవాహాన్ని నిర్వహించేందుకు…
మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇప్పటికే మూలధనం కోసం ఏర్పాట్లు చేసినప్పటికీ, వ్యాపార క్రెడిట్ కార్డును కలిగి ఉండాలి. దీని వలన మీరు పునరావృతమయ్యే ఛార్జీలను జాగ్రత్తగా చూసుకోవటానికి మరియు సురక్షితమైన ఆన్లైన్ కొనుగోళ్లు చేయడానికి వీలు కలుగుతుంది. కొన్ని కొనుగోళ్లలో క్యాష్ బ్యాక్ ఆఫర్లు వంటి అనేక అదనపు ప్రయోజనాలకు మీరు అర్హులవుతారు.
-
వస్త్ర వ్యాపారాన్ని ఏర్పాటు చేసే ప్రాంతం
వస్త్ర ఉత్పత్తులను విక్రయించే దుకాణం అయినా లేదా వస్త్రాలను ఉత్పత్తి చేసే కర్మాగారం అయినా, మీ వ్యాపార విజయాన్ని మరియు అభివృద్ధిని ప్రభావితం చేసే ప్రధాన అంశం. అదే సమయంలో మీ దుకాణానికి లేదా ఫ్యాక్టరీకి సమృద్ధిగా నీరు మరియు విద్యుత్ సరఫరా తప్పనిసరిగా ఉండాలి. దుకాణాల విషయంలో అయితే మీ లక్ష్య కొనుగోలుదారులు ఎక్కువగా ఉండే ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలి.
-
సమయ నిర్వహణ
ఏదైనా వ్యాపారం విజయవంతం కావడానికి సమయాన్ని నిర్వహించే కళను నేర్చుకోవడం చాలా ముఖ్యం. మీరు ఈ వ్యాపారం కోసం తక్కువ సమయం కేటాయిస్తుంటే, విలువైన వ్యాపార విధానాలను కోల్పోతున్నట్లే. అందుకే మీరు సమర్థవంతమైన సమయ నిర్వహణను అలవరచుకుని, అమలు చేయాలి.
-
రవాణా
మీ వస్త్ర వ్యాపారంలో ముఖ్యమైన విషయం రవాణా. ఏదైనా వ్యాపార సంస్థను ప్రారంభించడానికి ముందు మీరు మీ బడ్జెట్లో రవాణా ఖర్చును తప్పక జతచేర్చాలి.
-
మీ వ్యాపార అభివృద్ధి కోసం ప్రకటనలివ్వండి
మీరు ప్రారంభించబోయే లేదా ఇప్పటికే ప్రారంభించిన నూతన వ్యాపారం గురించి ప్రజలకు తెలియజేయాలి. సాధ్యమైనంత ఎక్కువ మంది కొనుగోలుదారులకు మీ వ్యాపారం గురించి తెలియజేయండి. మీ వ్యాపారం గురించి అత్యధికులకు ముందే తెలిస్తే మీరు వ్యాపార ప్రారంభం నుంచే మంచి ఆదరణ అందుకుంటారు. సోషల్ మీడియా మార్కెటింగ్ మరియు ఆన్లైన్ మార్కెటింగ్ ఈ రోజుల్లో అత్యంత శక్తివంతమైన సాధనాలు. ఈ సాధనాలను ఉపయోగించడం ద్వారా మీరు పెద్ద సంఖ్యలో లక్ష్య కొనుగోలుదారులను సమర్థవంతంగా చేరుకోగలుగుతారు. వ్యాపారాభివృద్ధి కోసం ట్విట్టర్లో సైన్ అప్ చేయడం లేదా ఫేస్బుక్లో కొత్త పేజీని సృష్టించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు.
వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు మీరు వ్యాపారాన్ని స్థాపించడం గురించి మాత్రమే కాకుండా, మీరు విక్రయించడానికి ఉద్దేశించిన ఉత్పత్తి గురించి కూడా తగినంత పరిజ్ఞానాన్ని కలిగివుండాలి. ఫాబ్రిక్ గురించి తగినంత జ్ఞానం, వస్త్రం ఎలా తయారవుతుంది? లేదా మీ ప్రత్యర్థుల కంటే మెరుగైన నాణ్యత కలిగిన వస్త్రాలను ఎలా ఉత్పత్తి చేయాలి? అనే విషయాలను తెలుసుకోవడం ఈ వ్యాపారంలో విజయాల నిచ్చెన ఎక్కడంలాంటిదని గ్రహించండి.