జిమ్ అండ్ ఫిట్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయడం ఎలా?
ప్రజల్లో ఆరోగ్య స్పృహ మరింతగా పెరుగుతుండటంతో జిమ్ వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతోంది. కొత్తగా మరిన్ని జిమ్లు పుట్టుకొస్తున్నాయి. ఇంట్లో వ్యాయామం చేయాలంటే బద్ధకిస్తారు కాబట్టి జిమ్ లేదా యోగా కేంద్రాలకు వెళ్లడం అలవాటు చేసుకుంటున్నారు. ఇలా జిమ్లో మెంబర్షిప్ తీసుకుంటే క్రమం తప్పకుండా వెళ్లొచ్చన్న ఆలోచనతో ఉంటున్నారు. జిమ్ వ్యాపారం మొదలుపెట్టాలంటే ముందుగా మీరు పోలీసుల నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. దాంతో పాటు జిమ్కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని జిమ్ వ్యాపారం ప్రారంభించవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియకన్నా ముందు జిమ్ ఏర్పాటు చేయడానికి తగిన ప్లేస్ చూసుకోవాలి. లీజ్ వ్యవహారాలన్నీ పక్కాగా చూసుకోవాలి. ప్రైవేట్ లిమిటెడ్గా రిజిస్టర్ చేయించుకుంటే జిమ్ను మరొకరి పేరు మీద సులువుగా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది.
ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు కోసం
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామం చేయాలనుకునేవారికి ఫిట్నెస్ సెంటర్ ఉపకరిస్తుంది. ఇందులో ఏరోబిక్స్, యోగా, మార్షల్ ఆర్ట్స్ లాంటివి నేర్చుకోవచ్చు. జిమ్ ఏర్పాటుచసేవారు ఆయా అంశాల్లో నైపుణ్యం సాధించినవారిని ఇన్స్ట్రక్టర్స్గా నియమించుకోవాలి. జిమ్ కోసం పెట్టుబడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే మీరు భారీ స్థాయిలో జిమ్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు పెట్టుబడి కూడా అదే స్థాయిలో ఉంటుంది. అందుకే ముందుగానే ఇన్వెస్ట్మెంట్ కోస్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాతే లైసెన్స్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టాలి. జిమ్ ఏర్పాటు చేయడానికి కనీసం 2500 నుంచి 3000 స్క్వేర్ ఫీట్ ఏరియా తప్పనిసరిగా ఉండాలి. పెట్టుబడిగా రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు పెట్టాల్సి ఉంటుంది. ఇంటీరియర్, డెకరేషన్, ఎక్యూప్మెంట్, మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ ఖర్చులన్నీ పరిగణలోకి తీసుకుని పెట్టుబడి నిర్ణయించాలి. మీరు ఒక మంచి ఏరియా చూసుకొని జిమ్ ఏర్పాటు చేస్తే మంచి ఆదాయం వస్తుందని చెప్పవచ్చు. కస్టమర్ల సంఖ్యను బట్టి ఆదాయం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న జిమ్లను చూస్తే రూ.50 లక్షల నుంచి 80 లక్షల వరకు పెట్టుబడి పెడుతుంటే ప్రతిఏటా రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు.
స్పెషాలిటీ ఫిట్నెస్ సెంటర్
ఇటువంటి ఫిట్నెస్ సెంటర్ ఎంతో ప్రత్యేకతను కలిగివుంటుంది. వాటిలో సైక్లింగ్, యోగా, ఏరోబిక్స్, పైలేట్స్, డ్యాన్స్ మొదలైనవాటిని ఏర్పాటు చేయాలి. ఇటువంటి ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలనుకుంటే నాణ్యమైన బోధకులను ఏర్పాటు చేయాల్సివుంటుంది. ఇటువంటి ఫిట్నెస్ కేంద్రాలు ఖరీదైనవిగా కనిపిస్తాయి. ఇటువంటి కేంద్రాలలో అనుభవం కలిగిన సర్టిఫికేట్ బోధకులు ఉంటారు. ఇటువంటి పిట్నెస్ సెంటర్లలో నెలవారీ ప్యాకేజీలను కూడా అందిస్తారు.
జిమ్కు అనువైన స్థానాన్ని ఎన్నుకోండి
మీ ఆరోగ్యం మరియు ఫిట్నెస్ జిమ్ వ్యాపారం కోసం మీరు అందుకు అనువైన స్థలాన్ని ఎంపికచేసుకోవాలి. దీనికి ఒక ప్రణాళిక వేసుకోవాలి. జిమ్కు ఎంత స్థలం అవసరమో నిర్ణయించడంలో ఈ ప్రణాళిక సహాయపడుతుంది. మీరు మీ కేంద్రానికి వచ్చే ఖాతాదారుల సంఖ్యను కూడా పరిగణలోకి తీసుకోవాలి.
సేవల ధరలు
మీరు మీరందించే సేవల ధరలను నిర్ణయించడం చాలా ముఖ్యం. మొదట మీరందించే సేవలను ఎంచుకున్నప్పుడే వాటికి తగిన ధరలను నిర్ణయించుకోవాలి. మీ జిమ్ ఉన్న పరిసరాలలోని ప్రజల అభిరుచులు, ఆదాయ సమూహాలు మరియు వయస్సు గురించిన సమాచారం సేకరించండి. మీరు సరికొత్త ఫిట్నెస్ పోకడలను గమనించి, ఎక్కువ మందిని ఆకర్షించే ప్రోగ్రామ్లతో ముందుకు రావాలి. ఇప్పుడు కొత్తగా కనుగొన్నవి లేదా కొత్తగా రూపొందించిన సేవల ఆధారంగా, మీరు వినియోగదారులు భరించగలిగే ధరను రూపొందించవచ్చు. మరియు వారు ఎక్కువకాలం మీ జిమ్ సభ్యునిగా ఉండాలంటే మంచి ప్లానింగ్తో ముందుకు వెళ్లాలి.
నిర్వహణ వివరాలు
మీరు మీ జిమ్ను ఒక క్రమ పద్ధతిలో నిర్వహించాల్సివుంటుంది. పరికరాలను నిర్వహణ, కొత్త తువ్వాళ్లు, మాట్స్, ప్రోటీన్ షేక్స్ మరియు బార్లు కొనుగోలు చేస్తుండాలి. అలాగే రెగ్యులర్ షవర్ క్లీనింగ్, లాకర్ రూములు, వ్యాయామప్రాంతం మొదలైనవి చక్కబెడుతుండాలి. ఇలాంటి చర్యల నిరంతర నిర్వహణకు మీరు తగినంత స్థలం కొనుగోలుకు, అద్దెకు ఖర్చు చేయాల్సివుంటుంది. జిమ్ మరియు ఫిట్నెస్ సెంటర్ యొక్క రోజువారీ కార్యకలాపాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. మీరు దీనిని రోజూ నిర్వహించలేని పక్షంలో ఇటువంటి పనులు నిర్వహించే వ్యక్తిని నియమించుకోవలసి ఉంటుంది. ఇందుకోసం మీరు జీతం రూపంలో వారికి చెల్లించాల్సివుంటుంది.
ప్రకటనలు తప్పనిసరి
ప్రకటనలు ఇవ్వకపోతే మీ వ్యాపారస్థానమేమిటో ఎవరికీ తెలియదు. అందుకే ప్రకటనల కోసం ప్లాన్ చేస్తున్నారు. మీ వ్యాపారం కోసం మీకు సరైన మార్కెటింగ్ పద్ధతులు అవసరం. సోషల్ మీడియాలో డిజిటల్ ప్రచారాలకు, సైన్ బోర్డులు వంటి కొన్ని సాంప్రదాయ పద్దతులను ఎంచుకోవడం ద్వారా దీనిని నెరవేర్చవచ్చు. ఇలాంటి కార్యకలాపాలు చేపట్టేందుకు కొంతమేరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ రూపొందించండి
మనం ఇప్పుడున్నది ఆన్లైన్ ప్రపంచం. ప్రతిదీ డిజిటల్ మాధ్యమంలో మార్పుచెందుతోంది. మీ జిమ్ లేదా ఫిట్నెస్ సెంటర్కు మంచి వెబ్సైట్ను అభివృద్ధి చేయడం ద్వారా మీ వ్యాపారాన్ని ఆన్లైన్లో అభివృద్ధి చేసుకోగలుగుతారు. ఫలితంగా స్థానికులు మీకు తేలికగా చేరువవుతారు. చాలా మంది జిమ్ శిక్షకులు, ఫిట్నెస్ నిపుణులు కూడా వ్యాయామం, పోషణ, ఆహారం మొదలైన అంశాలపై యాప్లు సృష్టిస్తున్నారు.
కస్టమర్ సేవలను మెరుగుపరచండి
మీరు మీ వ్యాయామశాలలో విభిన్న అంశాలను జతచేర్చినపుడు కస్టమర్లందరితో సరిగ్గా వ్యవహరించడం మీకు కష్టమవుతుంది. ఉదాహరణకు మీరు కొత్త సభ్యుడిని సైన్ అప్ చేస్తున్నప్పుడు లేదా మీరు పరిపాలనా పనులను చూసుకుంటున్నప్పుడు, ఉత్తమ కస్టమర్ సేవలను అందించడం మీకు అంత సులభం కాదు. అప్పుడు అది మీ వ్యాపారానికి ప్రతికూలంగా మారుతుంది. అందుకే మీరు సభ్యుల పేర్లను గుర్తుంచుకునే ప్రయత్నించాలి ప్రతిరోజూ చిరునవ్వుతో వారిని పలకరించండి. ఈ విధమైన ప్రవర్తనతో మీరు స్నేహపూర్వక సంబంధాన్నిపెంచుకోగలుగుతారు.
మార్కెటింగ్ తప్పనిసరి
మీ జిమ్ను సందర్శించే వారి సంఖ్య ఎక్కువగా ఉండాలంటే మార్కెటింగ్ ప్రయత్నాలను మరింతగా మెరుగుపరచడం గురించి మీరు ఆలోచించాలి. ఒకవేళ మీరు ట్విట్టర్ లేదా ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చురుకుగా లేకుంటే, మీరు వాటితో కనెక్ట్ అయ్యే సమయం ఇదేదని గుర్తించండి. మీరు మీ వ్యాపారాన్ని సూచించే పేజీని క్రియేట్ చేయాలి. దానిని వినియోగదారులు మిమ్మల్ని చేరుకోవడానికి మాధ్యమంగా ఉపయోగించాలి. వినియోగదారులు అడిగే ప్రశ్నలకు దానిలో సమాధానం ఇవ్వడి. ఆ పేజీలో ఆరోగ్య చిట్కాలను అందించండి. అధిక నాణ్యత కలిగిన కంటెంట్ వినియోగదారులకు అందుబాటులో ఉంచండి.
సిబ్బంది నియామకం
ఫిట్నెస్ సెంటర్ యజమాని ఎదుర్కొనే ప్రధాన సవాళ్లలో సిబ్బంది నియామకం కీలకమైనది. వినియోగదారులను ఆకర్షించడంలో బ్రాండ్ పేరును నిలబెట్టడంలో శిక్షకులు మరియు బృందాలు కీలక పాత్ర పోషిస్తాయి. వీరిని చూసిన మీదటనే వినియోగదారులు రోజూ జిమ్కు వచ్చేందుకు ఉత్సాహం చూపిస్తారు. సిబ్బందిని నియమించుకునేటప్పుడు అందుకు తగినంత బడ్జెట్ను కేటాయించాలి. తక్కువ అనుభం కలిగిన శిక్షకులను ఏర్పాటు చేయడం బ్రాండ్పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే మీరు కొంత సమయాన్ని వెచ్చించి నిపుణులైన సిబ్బందిని మీ జిమ్లో నియమించుకోండి.
ఎటువంటి సామగ్రి కొనుగోలు చేయాలి
మీరు కొత్త జిమ్ను ఏర్పాటు చేస్తున్నప్పుడు, అవసరమైన అన్ని పరికరాలను కొనుగోలు చేయాల్ని ఉంటుంది. అందుకు మీరు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కస్టమర్లు ఎవరూ గాయపడకుండా ఉండాలంటే మీరు నాణ్యమైన భాగాలు మరియు ఉపకరణాలను కొనుగోలు చేయాలి. ఇందుకోసం మీదగ్గర బడ్జెట్ తక్కువగా ఉంటే మీ జిమ్ను పూర్తిస్థాయిలో నడపడానికి మరికొంత సమయం వేచి చూడటం ఉత్తమం.
పోటీదారుల గురించి…
మీరుంటున్న ప్రాంతంలో మీ జిమ్కు పోటీగా అనేక జిమ్లు ఉంటాయి. దీనిని మీరు అర్థం చేసుకోవాలి. మీరు మీ ప్రత్యర్థుల నుంచి పోటీని ఎదుర్కొంటారు. దీనిని తట్టుకోవాలంటే మీరు వారికన్నా ఉత్తమ సేవలు మరియు సౌకర్యాలను అందించాలి. అలాగే జిమ్ విషయంలో మీ ప్రత్యేకతను చాటుకోవాలి. తాజా పోకడలను అనుసరించాలి. మీరు మీ జిమ్లో నిపుణులైన శిక్షకులు, అనుభవజ్ఞులైన డైటీషియన్లు, నాణ్యమైన పరికరాలు, మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుచేసుకోవాలి. ఇలాంటి సేవలు అందించడం ఖర్చుతో కూడిన పని. అందుకే ఇలాంటి వ్యాపార అవసరాలకు డబ్బు సమకూర్చుకోవాలి.
అనుమతులు మరిము ధృవపత్రాలు
మీ హెల్త్ మరియు ఫిట్నెస్ జిమ్ వ్యాపారాన్ని నడపడానికి స్థానిక మరియు రాష్ట్ర అధికారుల నుండి లైసెన్సులు మరియు అనుమతులు తీసుకోవాలి. వ్యాయామశాలను నడపడానికి మీకు ఈ అనుమతులు మరియు లైసెన్సులు తప్పనిసరి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి లేకుండా జిమ్ నడిపితే మీపై జరిమానాల భారం పడుతుంది. అందుకే ముందుగా రాష్ట్ర లేదా స్థానిక అధికారులను కలుసుకుని, మీ వ్యాపార సంస్థ గురించి వారికి తెలియజేయండి. వారి నుంచి సలహాలు తీసుకోండి.
సొంత జిమ్ కోసం….
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి రోజూ వ్యాయామ ప్రక్రియలను నిర్వహించాలనుకుని, వ్యాయామశాలలకో, జిమ్లకు వెళ్లలేని వారు తమ స్వంత జిమ్లను ఇంటిలోనే ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనికి వారివారి ఆర్థిక పరిస్థితిని బట్టి, వారు చేపట్టదలచిన వ్యాయామ ప్రక్రియలను అనుసించి పరికరాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే జిమ్ ఏర్పాటుకు ముందు కొన్ని అంశాలపై దృష్టి సారించి, తరువాత తగిన నిర్ణ యాలు తీసుకోవాలి. ఇంట్లో జిమ్ ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ఆర్థికవనరులున్నాయా? లేదా? అనేది మొదటగా ఆలోచించాలి. ఒకవేళ కొనుగోలు చేసిన పరికరాలన్నీ సరిగ్గా ఉపయోగించు కోగలుగుతామా? అనే ప్రశ్నకూడా తలెత్తుతుంది. ఉదాహరణకు కార్డియో వాస్క్యు లార్ వ్యాయామ ప్రక్రియలకు ఉపయోగించే ట్రెడ్మిల్ యంత్రం లేదా స్టేషనరీ బైక్ ఖరీదు ఎక్కువగా ఉంటుంది. దానిని కొనుగోలు చేసిన తరువాతసరైనరీతిలో ఉపయోగించని పక్షంలో అది వృధాగా పడి ఉంటుంది. కనుక వ్యాయామ ప్రక్రియలకు సంబంధించిన పరికరాలు కొనుగోలు చేసుకునే ముందు అవి ఏ మేరకు ఉపయోగించగలమనే అంశాన్ని కూడా గమనించాలి. వ్యాయామ పరికరాలు కొనుగోలు చేయాలను కున్నప్పుడు, వయస్సు, ఆరోగ్య సమస్యలు దృష్టిలో ఉంచుకుని మనం ఎలాంటి వ్యాయామాలు చేయవచ్చునో ఈ రంగంలోని నిపుణులను అడిగి తెలుసుకోవాలి. కార్డియో వాస్క్యులార్ వ్యవస్థ పటిష్టానికి సంబంధించిన వ్యాయామాలు చేయడానికి అందరికీ అందు బాటులో ఉండే స్కిప్పింగ్రోప్ దగ్గరనుంచి అత్యాధునిక ట్రెడ్మిల్ మొదలైనవి ఎన్నో పరికరాలు అందుబాటులో ఉన్నాయి. కండరాల పటిష్టత కోసం వ్యాయామ ప్రక్రియలు చేపట్టదలచుకున్నప్పుడు తక్కువధరలో, తక్కువ స్థలంలో ఇమిడే ఫ్రీ వెయిట్స్, రెసిస్టెన్స్ ట్యూబ్స్ లేదా బ్యాండ్ ట్స వంటి పరికరాలను పరిశీలించాలి. స్థోమతనుబట్టి మల్టీస్టేషన్ జిమ్నాజియమ్ పరికరాలను కూడా కొనుగోలు చేయవచ్చు.