భారతదేశంలో క్యాటరింగ్ వ్యాపారం ప్రారంభించడం ఎలా?
రోజు రోజుకీ మారుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా ప్రజల ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. అందుకనే భోజన ప్రియుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. చాలా మంది భిన్నరకాల ఆహారాలను ట్రై చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకనే ఇప్పుడు నగరాలతోపాటు పట్టణాల్లోనూ మొబైల్ క్యాంటీన్లు పెరిగిపోయాయి. తక్కువ ధరలకే రుచికరమైన, భిన్న రకాల వంటకాలను మనకు వారు అందిస్తున్నారు. అలాగే నిరుద్యోగులకు, మహిళలకు ఈ వ్యాపారం చక్కని స్వయం ఉపాధిని కల్పిస్తోంది. ఎవరైనా సరే ఫుడ్ ట్రక్, మొబైల్ క్యాంటీన్ బిజినెస్ను చేయవచ్చు. అందులో కొంత పెట్టుబడి పెట్టి, శ్రమిస్తే లాభాలను పొందవచ్చు. కాకపోతే కొంచెం పెట్టుబడి కొంచెం ఎక్కువే! మరి ఈ వ్యాపారానికి ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది? ఏ మేరకు ఆదాయం లభిస్తుంది? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మొబైల్ క్యాంటీన్
మొబైల్ క్యాంటీన్ (రెస్టారెంట్ ఆన్ వీల్స్) బిజినెస్ను ప్రారంభించేందుకు అనువైన వాహనాన్ని కొనుగోలు చేయాలి. అందుకు రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అలాగే క్యాంటీన్కు అవసరం అయిన స్టవ్, పాత్రలు, ఇతర సామగ్రి, టేబుల్స్, చెయిర్స్ తదితరాలను కొనుగోలు చేసేందుకు రూ.2 లక్షలు అవుతుంది. ఇక వంటకాల తయారీకి కావల్సిన ముడి పదార్ధాలను కొనుగోలు చేసేందుకు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు అవుతుంది. ఇక కస్టమర్ల నుంచి డిజిటల్ పద్ధతిలో పేమెంట్లను స్వీకరించేందుకు పీవోఎస్ మెషిన్ను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. అందుకు మరో రూ.30వేల వరకు అవుతుంది. వీటికోసం 6 నెలల వరకు మళ్లీ ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇక క్యాంటీన్లో పనిచేసేందుకు మ్యాన్ పవర్ అవసరం అవుతుంది. నెలకు రూ.13వేల నుంచి రూ.15వేలకు చెల్లిస్తూ, సిబ్బందిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ తరువాత క్యాంటీన్ వ్యాపారాన్ని పబ్లిసిటీ చేసేందుకు నెలకు రూ. 20వేల వరకు ఖర్చు చేస్తే వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో మొత్తం ఈ బిజినెస్ కోసం దాదాపుగా రూ.10 లక్షల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. అయితే ఇంకా పెద్ద ఎత్తున బిజినెస్ చేయాలంటే, అందుకు రూ.20 లక్షల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది.
ఇక మొబైల్ క్యాంటీన్ పెట్టాలంటే..
ప్రభుత్వం నుంచి లైసెన్స్, స్థానిక అగ్నిమాపక శాఖ అధికారుల నుంచి ఎన్వోసీ, లోకల్ మున్సిపల్ కార్యాలయం నుంచి వ్యాపారం చేసుకునేందుకు కావల్సిన అనుమతి పత్రం, వాహనాన్ని కమర్షియల్ ఉపయోగం కోసం వాడుతారు కనుక ఆర్టీవో నుంచి అందుకు సంబంధించిన అనుమతి పత్రాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత మొబైల్ క్యాంటీన్ వ్యాపారం ప్రారంభించవచ్చు.
రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉన్నవారికి మొబైల్ క్యాంటీన్ వ్యాపారం చక్కని లాభాలను ఇస్తుందని చెప్పవచ్చు. దీని వల్ల క్యాటరింగ్ ఆర్డర్లను కూడా తీసుకోవచ్చు. అలాగే నిర్దిష్టమైన స్థలం అంటూ అవసరం ఉండదు కనుక జనాలు బాగా ఉన్న ప్రాంతాల్లో వాహనాలను నిలిపి వ్యాపారం చేసుకోవచ్చు. దీంతో ఏయే ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఏయే రకాల ఆహారాలను తింటారు? వారు ఆహారం కోసం ఎంత వరకు వెచ్చిస్తారు? అక్కడ మొబైల్ క్యాంటీన్ నిర్వహణకు వ్యాపార అవకాశాలు ఇంకా ఏ విధంగా ఉంటాయి? ఇంకా ఏమేం రకాల వంటకాలను సదరు ప్రాంత వాసులకు అందించవచ్చు? అనే విషయాలను చక్కగా అర్థం చేసుకుని, ఆ మేరకు మొబైల్ క్యాంటీన్ను నిర్వహించవచ్చు. దీంతో వ్యాపారం ఎప్పుడూ సుస్థిరంగా కొనసాగి, లాభాలు వస్తూనే ఉంటాయి. మార్కెట్లో ఫుడ్ క్యాటరింగ్కు పోటీ చాలా ఎక్కువ. క్యాటరింగ్ పరిశ్రమ భారతదేశంలో సుమారు 15,000 నుంచి20,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది.
సుమారు 25-30శాతం వార్షిక వృద్ధితో ముందుకు సాగుతోంది.
మొబైల్ క్యాంటీన్ వ్యాపారం పెట్టాలనుకునే వారు ముందుగా అందుకు అనువైన స్థలాలను ఎంపిక చేసుకోవాలి. జనాలు బాగా ఉన్న ప్రాంతంలో ఈ వ్యాపారానికి డిమాండ్ ఉంటుంది కనుక.. ఆ మేరకు స్థలాలను ఎంచుకోవాలి. అప్పుడప్పుడూ స్థలాలను మారుస్తూ ఉండాలి. దీంతో వ్యాపారంపై చాలా అవగాహన వస్తుంది. ఇక క్యాంటీన్ వద్దకు వచ్చే భోజన ప్రియులు తమ వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు కావల్సిన స్థలం కూడా ఏర్పాటు చేసుకుంటే ఉత్తమం. క్యాంటీన్ను శుభ్రమైన వాతావరణంలో నిర్వహించాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. క్యాంటీన్లో వండే ఆహారాలను శుచిగా, శుభ్రంగా కస్టమర్లకు అందివ్వాలి. భోజనంలో నాణ్యత ఉండాలి. ఖరీదు మరీ ఎక్కువగా ఉండకూడదు. రుచికరమైన వంటకాలను అందించాలి. ఎప్పుడూ ఒకే రకమైన వంటకాలు కాకుండా, వివిధ రకాల ప్రత్యేకమైన వంటకాలను భోజన ప్రియులకు అందివ్వాలి. అలాగే తమ బ్రాండ్ను విస్తరించేందుకు తమకే ప్రత్యేకమయ్యేలా, తమ వద్దే లభించేలా ఏవైనా ప్రత్యేక వంటకాలను కస్టమర్లకు అందివ్వాలి. దీంతో కస్టమర్ల సంఖ్య అమితంగా పెరిగి వ్యాపారం అనతి కాలంలోనే వృద్ధి చెందేందుకు అవకాశాలుంటాయి.
ఇక క్యాంటీన్లను నిర్వహించే సమయాలు చాలా ముఖ్యం బ్రేక్ఫాస్ట్ అయితే ఉదయం సమయంలో.. అదే భోజనం అయితే మధ్యాహ్నం, రాత్రి సమయాల్లోనూ, స్నాక్స్ అయితే సాయంత్రం సమయాల్లో క్యాంటీన్ను నిర్వహించాలి. మొబైల్ క్యాంటీన్లను ఎక్కడైనా నిర్వహించే అవకాశం ఉంటుంది కనుక వీలైనంత వరకు ఒకే ప్రదేశంలో కొంత కాలం పాటు వ్యాపారం చేయాలి. ఆ తరువాత వ్యాపారంలో వచ్చే లాభాలు, జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను బట్టి క్యాంటీన్ను తిప్పుతూ వ్యాపారం చేయవచ్చు. దీంతో తక్కువ కాలంలోనే ఈ బిజినెస్ ద్వారా లాభాలను అందుకోవచ్చు.
ఇంట్లోనే క్యాటరింగ్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి?
మీరు చిన్న తరహా క్యాటరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు 12 నుంచి 50 మందికి ఆర్డర్లను పొందడంపై దృష్టి పెట్టాలి. మరోవైపు, పెద్ద ఎత్తున ఈ వ్యాపారంలోకి రావడానికి మీకు తగినంత నమ్మకం ఉంటే, మీరు చేయాల్సిందల్లా మీ మూలధనాన్ని క్రమబద్ధీకరించాలి. స్వంత ఫుడ్ క్యాటరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మీరు తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి
ఫుడ్ క్యాటరింగ్ వ్యాపారం ప్రారంభించేముందు…
సరైన వ్యాపార ప్రణాళికను రూపొందించండి. మరియు అందుకు తగిన ప్రాంతాన్ని ఖరారు చేయండి. మీ వ్యాపార నిర్వహణకు అద్దెకు తగిన ప్రాంతాన్ని తీసుకోండి. తగిన పెట్టుబడులపై దృష్టి పెట్టండి. ముందుగా క్యాంటరింగ్కు అవసరమైన పరికరాలను కొనుగోలు చేయండి. మీ క్యాటరింగ్ సామాగ్రి కోసం మీ సోర్స్ విక్రేతలను సంప్రదించండి. లైసెన్సులు మరియు అనుమతులను పొందండి. ఆహార వ్యయం మరియు మెనూ ఇంజనీరింగ్పై తగిన నిర్ణయం తీసుకోండి. తగినంతమంది సిబ్బందిని నియమించుకోండి. మీ బ్రాండ్ను బాగా మార్కెట్ చేయండి. అందుకు టెక్నాలజీని ఉపయోగించండి – ఆర్డర్లు పొందడానికి, స్టాక్ నిర్వహణ కోసం సరైన వ్యాపార ప్రణాళికను రూపొందించండి.పెట్టుబడి ఖర్చులు మరియు ప్రారంభ నెలల్లో అయ్యే ఖర్చులను భరించాలి. క్యాటరింగ్ సెంటర్ ఎన్నుకున్న తరువాత మీరు మీ వంటకాలను ఖరారు చేయాలి. వినియోగదారుల నుండి ప్రామాణికమైన అభిప్రాయాలను సేకరించాలి. వ్యాపారం పూర్తిగా సెటప్ కావడానికి ముందే ఎక్కువ మంది కస్టమర్లను మరియు ప్రీ–ఆర్డర్లను పొందడానికి ఇది మీకు సహాయపడుతుంది.
అద్భుతాలు చేసే నోటిమాట
ఇతర వ్యాపారాల మాదిరిగా కాకుండా, క్యాటరింగ్ వ్యాపారం వారి ప్రస్తుత కస్టమర్ల నోటి మాట ఆధారంగా మాత్రమే చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే క్యాటరింగ్ సెంటర్ ప్రచారం కోసం వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను ఉపయోగించండి. మీ స్వంత వెబ్సైట్ను సృష్టించడం అనేది క్యాటరింగ్ వ్యాపారంలో, ముఖ్యంగా ప్రస్తుత కాలంలో చాలా అవసరం. ఇది కస్టమర్లలో నమ్మకాన్ని పెంచుతుంది. ఈవెంట్ ప్లానర్లు, డిజెలు, కేక్ తయారీదారులు మొదలైనవాటితో మీ నెట్వర్క్ను పెంచుకోవడానికి బి 2 బి ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చాలా పోటీ కలిగిన మార్కెట్. క్యాటరింగ్ వ్యాపారంలోకి ప్రవేశించడానికి వందలాది మంది ప్రయత్నిస్తున్నారు. రెఫరల్లను ఆకర్షించడంలో మీకు సహాయపడే విభిన్న ఆఫర్లు, ప్రచారాలు మరియు ఇతర పద్దతులను అమలు చేయండి. ఇందుకు ఇమెయిల్–మార్కెటింగ్ కూడా సహాయపడుతుంది,
ఇక ఈ వ్యాపారం ద్వారా నెలకు రూ.లక్షల్లో సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. అది ఎవరైనా సరే.. వారు పెట్టే పెట్టుబడిని బట్టి ఉంటుంది. అలాగే మొబైల్ క్యాంటీన్ను నిర్వహించే ప్రదేశం.. అందించే ఆహారం.. జన సాంద్రత.. తదితర అంశాలను బట్టి కూడా ఆదాయం మారుతుంది. అయితే ప్రస్తుతం చాలా మంది మొబైల్ రెస్టారెంట్ల యజమానులు నిత్యం రూ.5వేలు మొదలుకొని రూ.25వేల వరకు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో వ్యాపారం విజయవంతం అయితే నెలకు ఎంత వరకు సంపాదించవచ్చో.. ఎవరైనా.. ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ బిజినెస్ ఒక్కసారి గనక విజయవంతం అయితే.. నెలనెలా లక్షల రూపాయల్లో కచ్చితంగా ఆదాయం వస్తుందని చెప్పవచ్చు.
రోడ్డు సైడ్ టిఫిన్ సెంటర్
తోపుడు బండ్లపై టిఫిన్స్, స్నాక్స్ విక్రయించవచ్చు. మంచి కెరీర్ కు, అంతకు మించి లాభాలకు బాటలు వేసే మరో వ్యాపారం సాయింత్రం
స్నాక్స్ వ్యాపారం. టిఫిన్స్ అంత స్థాయిలో లాభాలు రాకున్నా సాయింత్రం తోపుడుబళ్లపై వేసే స్నాక్స్ కు కూడా తగినంత డిమాండ్ ఉంది. అయితే ఇందులో ఉండే ప్రధాన వెసులుబాటు తక్కువ కష్టం, తక్కువ సమయం, అదే సమయంలో ఎక్కువ లాభం. సాయింత్రం వరకూ వేరే ఏదైనా పనిచేసుకుని, సాయింత్రం కేవలం నాలుగు గంటలు కష్టపడితే పెట్టుబడి పోయినా రోజుకు 2 నుంచి 3 వేలు సంపాదించే అవకాశాలువుంటాయి. సాయింత్రం అమ్మే సమోసాలు, బజ్జీలు, పకోడీలకు ఇప్పుడు ఎంతటి డిమాండ్ ఉందో మనకు తెలియంది కాదు. అయితే అందులోనే అద్భుతమైన కెరీర్ కు అవకాశాలున్నాయని మనం తెలుసుకోలేం.
మార్నింగ్ టిఫిన్స్, ఈవెనింగ్ స్నాక్స్ వ్యాపారంలో మంచి అనుభవం గడిస్తే, కాస్త పెట్టుబడిపెట్టి క్యాటరింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టవచ్చు. క్యాటరింగ్ వ్యాపారం విజయవంతమై మీ జీవితం రోడ్డు సైడ్ నుంచి ఉన్నతస్థాయికి మారుతుంది. బిజీ సెంటర్స్ లో వేడి వేడి స్వీట్ కార్న్ అమ్మడం, టోల్ గేట్స్ దగ్గర, రైల్వే క్రాసింగ్ దగ్గర తినుబండారాలు అమ్మడం వంటివి కూడా చేయవచ్చు. ఇటువంటి రోడ్ సైడ్ కెరీర్స్ లో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశాలతో పాటు మరెన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి. ప్రభుత్వానికి పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. లైసెన్సింగ్ తలనొప్పి లేదు. నచ్చితేనే పని చేసే వెసులుబాటు. నో జీఎస్టీ, నో సర్వీస్ టాక్స్. ప్రతీరోజూ లిక్విడ్ గా కరెన్సీ రూపంలో వచ్చే మనీ. పార్ట్ టైమ్ గా చేసుకునే సౌకర్యం ఉంటుంది.
మంచి కెరీర్స్ ఉన్నత చదువులు చదివిన వారికే ఉంటాయి అనుకోవడం తప్పు. కష్టపడితే ఎవరైనా గొప్పవాళ్లు కావొచ్చు. ఎంత పెద్ద ప్రయాణమైనా చిన్న అడుగుతోనే మొదలవుతుంది. పెట్టుబడి లేదు, చదువు లేదు అని చింతించడం మాని ఆత్మవిశ్వాసంతో అడుగు వేస్తే లక్ష్యం చేరుకోవచ్చు. తోపుడు బండ్లు, స్నాక్స్ లాంటి వ్యాపారాలు చిన్నవి అనే ఆలోచన మానేయండి. ఈ వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయం మంచి ఉద్యోగాలు చేస్తున్న వారితో సమానంగా ఉన్నప్పుడు ఇటువంటి వ్యాపారం ప్రారంభించడంలో తప్పులేదు. ఈ వ్యాపారంపెద్ద స్థాయికి చేరుకునేందుకు పునాదిలా ఉపయోగపడినప్పుడు ఆ అవకాశాన్ని చేజార్చుకుంటే మనదే తప్పు అవుతుంది. అందుకు మీ కలలను నెరవేర్చుకునేందుకు ఏ వ్యాపారాన్నయినా చిన్నా స్థాయిలోనైనా ప్రారంభించవచ్చు.