కారు, ఆటో మరమ్మతు వ్యాపారం ప్రారంభించడం ఎలా?
మీరు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే ఏ వ్యాపారం చేయాలో తెలియడం లేదా? మీకు ఆటోమొబైల్స్ పట్ల ఆసక్తి ఉందా? అయితే మీరు కారు, ఆటో మరమ్మతు దుకాణాన్ని ప్రారంభించాలనుకోవడం ఉత్తమ వ్యాపార ఎంపికగా గ్రహించండి. ఈ వ్యాసంలో కారు, ఆటో మరమ్మతు దుకాణాన్ని ప్రారంభించడానికి అవసరమైన అన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఆటో మరమ్మతు వ్యాపారం అత్యంత లాభదాయకమైన వ్యాపార ఆలోచనలలో ఒకటి. మరియు ఇది మంచి ఆదాయాన్ని అందించే వెంచర్‌గా పరిగణించవచ్చు.
ఆటో మరమ్మతు వ్యాపార పరిచయం
ఈ వ్యాపారంపై ఆసక్తి ఉన్న పారిశ్రామికవేత్తలు ఇప్పటికే ఈ పరిశ్రమలో తమ సత్తాను చూపారు. వారి కృషి ఈ రంగంలో వ్యవస్థాపకులుగా మారాలనుకుంటున్నవారికి ఆటో మరమ్మతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసేలా ప్రేరేపిస్తుంటుంది. మీరు ఆటో మరమ్మతు వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటుంటే, అది చాలా మంచి ఆలోచనగా భావించండి. అయితే ఆటో రిపేర్ వ్యాపారం / సేవను ప్రారంభించడం అంత తేలికైన పని కాదని కూడా గమనించండి. ఏదైనా వ్యాపారం విజయవంతం కావాలంటే అందుకు తగిన సమయం కేటాయిస్తూ, కృషి, పట్టుదలతో మంచి నిర్వహణ నైపుణ్యాలు సంపాదించాలి. వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు ఆ వ్యక్తి ఆ వ్యాపారంలోగల వివిధ దిశల గురించి ఆలోచించాలి. సాధ్యమయ్యే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వ్యాపారాన్ని సజావుగా నిర్వహించడానికి సరైన వ్యాపార ప్రణాళికను రూపొందించుకోవాలి. ప్రతి నిర్ణయం వెనుక తగిన ఆలోచన, నిర్ణయం ఉండాలి.
ఆటో రిపేరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు…
వ్యాపార ప్రణాళిక: వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముఖ్యమైన అంశం సరైన వ్యాపార ప్రణాళికను సిద్ధం చేసుకోవడం. మంచి వ్యాపార ప్రణాళిక అనేది వ్యాపారాన్ని నిర్వహించడానికి అవసరమైన అన్ని అంశాలను వివరిస్తుంది. వ్యాపారానికి తగిన స్థలాన్ని ఎంచుకోవడం, ఫైనాన్స్ ఏర్పాటు, ఉద్యోగులను నియమించడం, వ్యాపారంతో అనుసంధానమైన ప్రతి కార్యాచరణకు తగిన ప్రణాళిక అవసరం. ఏ ప్రణాళిక లేకుండా ప్రారంభించిన వ్యాపారం విఫలమయ్యేందుకు అవకాశాలుంటాయి. అందుకే ఆటో మరమ్మతు వ్యాపారాన్ని ప్రారంభించడంలో మొదటి దశ వ్యాపార ప్రణాళికను సిద్ధం చేయడం. మీరు వ్యాపార ప్రణాళికను సిద్ధం చేసుకోలేకపోతే, మీరు ఈ రంగంలోని నిపుణుల సహాయం తీసుకోవాల్సివుంటుంది.
వ్యాపారం ఏర్పాటుచేసే ప్రాంతం:
వ్యాపార ప్రణాళిక రూపకల్పన ఖరారు చేసిన తరువాత, తదుపరి ప్రక్రియ వ్యాపారాన్ని ఏర్పాటు చేయడానికి తగిన ప్రాంతాన్ని ఎన్నుకోవడం. ఆటో రిపేరింగ్ వ్యాపారానికి అనువైన ప్రాంతాన్ని ఎన్నుకోవాలి. ఇందుకోసం ముందుగా ఒక సర్వే చేయాలి. మీరు ఏదోఒక తక్కువ అద్దె కలిగిన ప్రదేశాన్ని ఎంచుకున్నా, ఆ ప్రదేశంలోకి వచ్చే ఆటోమొబైల్స్ ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉన్నా, ఆటో రిపేరింగ్ వ్యాపారంతో ఆదాయం సంపాదించడం కాస్త కష్టమవుతుంది. అందుకే అధిక ట్రాఫిక్ కలిగిన ప్రాంతంలో ఆటో రిపేరింగ్ దుకాణం ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతాన్ని ఎన్నుకునేటప్పుడు పరిగణించవలసిన మరో అంశం ఏమిటంటే రెండు ఆటో రిపేరింగ్ షాపుల మధ్య దూరాన్ని పరిగణించాలి. ఇప్పటికే ఉన్న మరమ్మతు దుకాణం పక్కన మరో ఆటో మరమ్మతు దుకాణం ప్రారంభిస్తే, అది ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. అందుకే అదే రకమైన సేవలను అందించే ఇతర దుకాణాలకు కాస్త దూరంలో ఆటో–రిపేరింగ్ దుకాణాన్ని ఏర్పాటు చేయాలి. పైగా ఈ ప్రదేశం వినియోగదారులకు అందుబాటులో ఉండాలి. దీనికితోడు వెయిటింగ్ జోన్ మరియు వాష్‌రూమ్ వంటి అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. అందుకే ఈ వ్యాపారంలోకి దిగే వ్యక్తి వ్యాపారానికి దీర్ఘకాలంలో లాభదాయకమని నిరూపించే ప్రదేశాన్ని ఎన్నుకోవాలి.
అనుభవం:
చాలా మందికి ఆటో రిపేరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడం ఎంతో కష్టమైన పని. ఈ ఫీల్డ్‌లో మీకు అనుభవం ఉంటే అది మీకు అదనపు ప్రయోజనాన్ని అందిస్తుంది. అయితే మీకు ఈరంగంలో పరిజ్ఞానం లేకపోతే మీరు ఏదైనా శిక్షణ కోర్సులో చేరవచ్చు. మరియు ధృవీకరణ పొందవచ్చు. మీరు సర్వీసింగ్ పనుల్లో ఉండాలని అనుకోకపోతే యజమాని కావాలనుకుంటే, మీరు మీ వ్యాపారం కోసం అనుభవజ్ఞులైన మెకానిక్‌లను మరియు సాంకేతిక నిపుణులను నియమించుకోవాలి. అయితే అర్హతగల మరియు ప్రతిభావంతులైన మెకానిక్‌లను నియమించడం చాలా కష్టమైన పని. ఇందుకోసం వ్యాపార యజమాని తగినంత సమయం తీసుకోవాలి.
ఉపకరణాలు:
సమర్థవంతమైన ఆటో మరమ్మతు వ్యాపారవేత్త ఎల్లప్పుడూ వ్యాపార అవసరాలకు సరిపోయే గ్యారేజీని నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆటో మరమ్మతు దుకాణం విడిభాగాల కోసం ఒక వ్యవస్థీకృత గదిని ఏర్పాటు చేసుకోవాలి. దీనిలో అన్ని పరికరాలు మరియు సామగ్రి క్రమబద్ధంగా అమర్చుకోవాలి. ఆటో రిపేరింగ్‌కు ఉపయోగించే సాధనాలు కొన్ని చౌకగా, మరికొన్ని ఖరీదైనవి ఉంటాయి. రెంచెస్, ఎయిర్ టూల్ వంటి చిన్న ఉపకరణాలను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. కానీ, లిఫ్ట్, వీల్ బ్యాలెన్సర్, బ్రేక్ లాథ్ వంటి సాధనాలు ఖరీదు కలిగి ఉంటాయి. కొత్త వ్యాపారాన్ని సజావుగా మరియు సమర్థవంతంగా నడిపించడానికి ఇటువంటి పరికరాలు కొనడం ఎంతో అవసరం. వ్యాపారాన్ని ప్రాంరభించిన వెంటనే వీలైనంత త్వరగా వీటిని కొనుగోలు చేయాలి. అయితే తగిన బడ్జెట్లోనే ఇవి ఉండేలా చూసుకోవాలి. అలాగే అవగాహన లేకుండా డబ్బు వృధా చేయడం మంచిదికాదని గుర్తుంచుకోండి.
నగదు:
వ్యాపార యజమాని అన్ని వ్యాపార కార్యకలాపాలతోపాటు వ్యక్తిగత బిల్లులను చెల్లించడానికి తగినంత ఫైనాన్స్ అందుబాటులో ఉంచుకోవాలి. వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు తగినంత నిధులు ఉంటే సరిపోతుంది. లేనిపక్షంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు బంధువుల నుండి డబ్బును రుణం రూపంలో పొందేందుకు ప్రయత్నించాలి. అలాగే రుణం కోసం అవసరమైన పత్రాలను అందించి బ్యాంకు నుండి కూడా ఆర్థిక సహాయం తీసుకోవచ్చు. అయితే అనవసరమైన వస్తువుల కొనుగోలుతో డబ్బు వృథా చేయవద్దు. మంచి వ్యాపారవేత్త ఎప్పుడూ పరిస్థితిని క్లిష్టతరం చేసుకోడు. అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాడు. వ్యాపారాన్ని సమర్థవంతంగా నడపడానికి ఆర్థిక నిర్వహణ అనేది చాలా ముఖ్యం.
ఎటువంటి సేవలు అందించాలనుకుంటున్నారు?:
ఆటో మరమ్మతు వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు పరిగణించవలసిన ముఖ్యమైన అంశాలలో ఒకటి మీ దుకాణం అందించే సేవల రకాలు. ఆటోమొబైల్ రంగంలో అనేక రకాల సేవలు ఉంటాయి. కొన్ని షాపులు బ్రేకులు, విండ్‌షీల్డ్స్, ట్రాన్స్మిషన్ మరియు ఆటోమొబైల్ ఎలక్ట్రీషియన్ వంటి బాడీ సేవలను అందించడంలో ప్రత్యేకత కలిగి ఉంటాయి. మరికొన్ని దుకాణాలలో ఆయిల్ సర్వీసింగ్, గీతలు పెయింట్ వర్క్ మరియు డెంట్ మరమ్మతు సేవలు అందిస్తుంటారు. అందుకే ఆటో మరమ్మతు వ్యాపారం ప్రారంభించేముందు ఎటువంటి సేవలను అందిచాలనుకుంటున్నారో నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం.
రేటు:
మీ ఆటో మరమ్మతు దుకాణంలో అందించే సేవలకు తగిన పోటీ రేటును సెట్ చేయండి. కస్టమర్లు మీరందించే సేవలు ఖరీదైనవిగా భావించి, మీ దుకాణానికి వచ్చేందుకు వెనుకాడే విధంగా రేట్లు ఉండకూడదు. మీ వ్యాపారాన్ని వృద్ధి చేసేలా, నష్టాలు ఎదురుకాకుండా ఉండేలా మీరందించే సేవల రేట్లు ఉండాలి.
వ్యాపారానికి తగిన పేరు: ఇది ఏమంత కష్టమైన పని కానప్పటికీ, వ్యాపారం పేరు ఆకర్షణీయంగా ఉండాలి. మరియు మీరు చేసే వ్యాపారాన్ని అది వివరించాలి. వ్యాపారానికి తగిన పేరు పెట్టుకోకపోతే వినియోగదారులు దుకాణానికి ఆకర్షితులు కారని చెప్పవచ్చు. అందుకే మీరు ప్రారంభించే వ్యాపారానికి పేరు సృజనాత్మకంగా ఉండాలి. మరియు ప్రత్యేకంగా ఉంటూ, సులభంగా గుర్తించగలిగే పేరును ఎన్నుకోవాలి. మీ వ్యాపారానికి ఎంచుకున్న పేరు ఇతర పోటీ వ్యాపారాలకు భిన్నంగా ఉండాలి.
ప్రకటనలు:
మీరు ప్రారంభించే వ్యాపారానికి ప్రచారం తప్పనిసరి. మీ వ్యాపారానికి ప్రచారం కల్పించేందుకు కరపత్రాలు, వార్తాపత్రికలలో ప్రకటనలు ఇవ్వండి. దానిలో మీ వ్యాపార వివరాలు, చిరునామా మరియు సంప్రదింపుల కోసం ఫోను నంబర్‌ను పేర్కొనాలి. అలాగే కరపత్రాలను దినపత్రికలో ఉంచమని స్థానిక న్యూస్ పేపర్ పంపిణీదారుని కోరవచ్చు. అలాగే వార్తాపత్రికలోని వర్గీకృత విభాగంలో ఒక చిన్న ప్రకటనను ఇవ్వవచ్చు. మీ దుకాణం గురించి, అక్కడ అందించే సేవల గురించి ఇతరులకు చెప్పమని మీ స్నేహితులు మరియు బంధువులను కోరండి. కస్టమర్లను ఆకర్షించడానికి వివిధ ఆఫర్లను అందించడానికి ప్రయత్నించండి. మీ వ్యాపారానికి ప్రాచుర్యం కల్పించడానికి మీరు సృజనాత్మకంగా వ్యవహరించాలి. సరైన అంచనాతో ఏ రకమైన ప్రకటనతో ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రకటనలు ఇవ్వడం ఉత్తమం. అలాగే మీ దుకాణానికి వచ్చే కస్టమర్లలో ఎక్కువ మంది ఏ ప్రాంతం నుండి వస్తున్నారో తెలుసుకోవడానికి ఒక సర్వే చేయండి.
నమోదు మరియు లైసెన్స్:
సరైన స్థలంలో మీ దుకాణాన్ని సెట్ చేశాక, మీ గ్యారేజ్ / ఆటో మరమ్మతు వ్యాపారాన్ని రిజిస్ట్రర్ చేయించండి.. ఆటో మరమ్మతు దుకాణాన్ని ప్రారంభించడానికి తగిన లైసెన్స్ మరియు ప్రభుత్వ అనుమతులను పొందండి.
రక్షణ మరియు భీమా:
ఏదైనా వ్యాపారం కోసం రక్షణ ఏర్పాట్లు తప్పనిసరి. ఏ రకమైన ప్రమాదం ఎదురైనా దానిని ఎదుర్కోవటానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం ఉత్తమ వ్యాపార లక్షణం. అలాగే మిమ్మల్ని, మీ వ్యాపారానికి రక్షణ కల్పించేందుకు సరైన బీమా పథకాన్ని ఎన్నుకోవాలి. మంచి వ్యవస్థాపకుడు లేదా వ్యాపారవేత్త ఉత్తమ వ్యాపార ప్రణాళికను అనుసరించాలి. అందుకే మీరు ఆటో మరమ్మతు దుకాణాన్ని ప్రారంభించే ముందు వివరణాత్మక వ్యాపార ప్రణాళికను సిద్ధం చేసుకుని, తదనుగుణంగా ముందుకు సాగండి.