ఇంటీరియర్ డిజైన్ బిజినెస్
ప్రస్తుత రోజుల్లో నగరాల్లోనే కాకుండా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటీరియర్ డిజైన్పై ప్రతి ఒక్కరికీ ఎంతో మక్కువ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం అపార్ట్మెంట్లకే పరిమితమైన ఈ కల్చర్ మెల్లమెల్లగా అన్నిగృహాలకు విస్తరిస్తోంది. దీంతో ప్రస్తుతం ఇంటీరియర్ డిజైన్కు మార్కెట్లో రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. కొత్తగా బిజినెస్ చేయాలనుకునే వారికి, విభిన్నంగా ఆలోచించే వారికి ఇంటీరియర్ డిజైనింగ్ సువర్ణావశకాశంగా చెప్పొచ్చు. మీ తెలివితేటలు, క్రియేటివిటీతో మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయవచ్చు. ఇక స్వయంఉపాధిగా ఇంటీరియర్ డిజైన్ బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్యాపారానికి ఎంత పెట్టుబడి అవసరమవుతుందో పూర్తి వివరాలను తెలుసుకుందాం. భారత ప్రభుత్వం చొరవతో గృహ నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీని ద్వారా ఇంటీరియర్ డిజైన్ వ్యాపారానికి పుష్కలంగా అవకాశాలు ఏర్పడుతున్నాయి.
ఇటీవలి కాలంలో చాలా మంది తమ అభిరుచులకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకునేందుకు అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నారు. తమ ఇష్టానికి అనుగుణంగా నిర్మించుకునే కలల సౌధాన్ని మరింత అందంగా, చూడముచ్చటగా అలంకరించడంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంట్లోని ప్రతి గదిని ప్రత్యేకంగా డిజైన్ చేసుకుంటున్నారు. వంటగది, పిల్లల గది, హోమ్ థియేటర్, పడకగది, లివింగ్ రూం, డైనింగ్ హాల్ ఇలా ప్రతి దాన్ని వేర్వేరుగా దానికి తగ్గట్లుగా ఇంటీరియర్ డిజైనర్ల సలహాలు, సూచనలు మేరకు, నిర్మించుకుంటున్నారు. గృహ నిర్మాణంలో ఇంటీరియర్ డిజైనింగ్కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.
ఇంటీరియర్ డిజైనింగ్ కోసం లక్షలు ఖర్చు
సొంతింటి కోసం చేసే ఖర్చులో ఇప్పుడు ఎక్కువ భాగం ఇంటీరియర్ డిజైనింగ్ కోసం ఖర్చు చేస్తున్నారు. లక్షలు, కోట్లు ఖర్చు చేసి, ఇళ్లను కొనుగోలు చేస్తున్న యజమానులు, ఆ ఇంటిని అందమైన ఆకృతులతో ఆకట్టునేలా ఉండేందుకు ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం రూ.3 లక్షల నుంచి రూ.25 లక్షలకు వరకు డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఇంట్లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఏ రూమ్లో ఏ రంగు వేయాలి? ఎలాంటి ఫ్లోరింగ్ ఎంచుకోవాలి? అనే విషయాలపై అత్యధిక శ్రద్ద చూపుతున్నారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే మనసుకు హత్తుకునే విధంగా లక్షలు పెట్టి ఫర్నిచర్ కొనుగోలు చేస్తున్నారు. పాత ఇంట్లో ఉన్న సామగ్రిని కొత్త ఇంట్లోకి తీసుకురాకుండా ఇంటీరియర్ డిజైనర్ సూచనలమేరకు నూతన ఫర్నిచర్ ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్ని ఇళ్లలో ఫ్లోరింగులను గమనిస్తే ఇంటిని ఇంత అందంగా అలంకరించుకోవచ్చా? అనే ఆసక్తి ఎవరికైనా కలగక మానదు. ఫలితంగా మార్కెట్లో ఇంటీరియర్ డిజైనర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. కొన్ని కంపెనీలు ఇంటీరియర్ డిజైనర్లకు సివిల్ ఇంజనీరింగ్ నిపుణుల కంటే ఆకర్షణీయమైన వేతనాలు, ఆఫర్లు ఇచ్చి మరీ నియమించుకుంటున్నాయి. ప్రస్తుతం రూ.50 లక్షలు, అంతకంటే ఎక్కువ వెచ్చించే ఇళ్లు, అపార్టుమెంట్ల యజమానులు ఇంటీరియర్ డిజైనింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు.
వంటిళ్లకు ఆధునిక డిజైన్లు
మారుతున్న అలవాట్లకు తగ్గట్టు వంటిళ్లనూ ఆధునిక డిజైన్లతో నూతనంగా తీర్చిదిద్దుతున్నారు. నగరవాసులకు ఆధునిక వంటగదే లివింగ్ రూమ్గా మారింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే ఇంట్లో ఉండే సమయం చాలా తక్కువ. ఉన్న సమయంలోనూ వంట చేస్తూ, పిల్లలతో గడపాలంటే సంప్రదాయ వంట గదుల్లో అది కుదరని పని. అందుకే వంటగదిని మారిన అవసరాలకు అనుగుణంగా అందంగా తీర్చిదిద్దుకునేందుకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో చాలా మంది మాడ్యులర్ కిచెన్లను ఇష్టపడుతున్నారు. మారిన జీవన శైలికి అనుగుణంగా వీటిని డిజైన్ చేస్తున్నారు. మహిళలు తమ అవసరాలు, ఆలోచనలకు అనుగుణంగా వంటగదులను శాస్త్రీయంగా డిజైన్ చేయిస్తున్నారు. వంటగది అందంగా, శుభ్రంగా ఉండడంతో పాటు సురక్షితంగా ఉండటమూ ఎంతో ముఖ్యం. ఇందుకోసం ఇంటీరియర్ డిజైనర్లతో చర్చించి, అందులో ప్రత్యేక సామగ్రిని వాడుతున్నారు. మంటలను తట్టుకోవడం, నీళ్లు పడినా పాడవకపోవడం, చెదల సమస్య లేని కిచెన్ సామగ్రిని వాడుతున్నారు. సిరామిక్, క్రిస్టల్ గ్లాస్, పీవీసీ, ప్లైవుడ్ సామాగ్రి వాడితే అందంతో పాటు ఇల్లు ఆకర్షణీయంగా రూపు దిద్దుకుంటుంది.
నూతన గృహానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో, లివింగ్ రూం. పడకగదులు, వంటగదితో పాటు ఇప్పుడు సాన్నాల గది అలంకరణకూ అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. బాత్రూమ్ ఇంటీరియర్ ఇప్పుడు కొత్త ట్రెండ్గా మారింది. సాన్నాల గదులను ఇరుకిరుకుగా కాకుండా, విశాలంగా ఉండేలా నిర్మాణాలు చేపడుతున్నారు. గోడలకు ప్రత్యేక టైల్స్తో అలంకరణ, ప్రత్యేకంగా బాత్ టబ్‌లు, షవర్‌బాత్‌లు… ఇలా ప్రతీ ఒక్కదానినీ ఇంటీరియర్ డిజైనర్ సూచనలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. విలాసమైంత ఇళ్లలోని సాన్నాల గదులను చూస్తున్న మధ్య తరగతి ప్రజలు, తమ ఇళ్లలోని సాన్నాల గదులనూ ప్రత్యేకంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
నిర్మాణ రంగంలో ఆర్కిటెక్ట్‌ల మాదిరిగానే ఇంటీరియర్ డిజైనర్లకు ఎంతో డిమాండ్ ఉంది. ఇళ్ల యజమానులు ముందుగా ఇంటర్నెట్లో ఇంటీరియర్స్ గురించి తెలుసుకొని, ఆ తర్వాత ఇంటీరియర్ డిజైనర్స్‌ను సంప్రదించి, వారిని కన్సల్టెంట్లుగా నియమించుకుంటున్నారు. చాలా మంది తమ ఇల్లు నిర్మాణంలో ఉండగానే డిజైనర్లకు ఇంటిని చూపించి ఆ స్థలానికి అనుగుణంగా డిజైన్లు చేయించుకుంటున్నారు. బిల్డర్లు చేపట్టే ఇళ్లు, అపార్టుమెంట్లలోని ఫ్లాట్లలో కొనుగోలుదారులు స్వయంగా తమకు నచ్చిన డిజైన్లతో నిర్మాణాలు చేయించుకుంటున్నారు.
సాంకేతికత మేళవింపుతో నిర్మాణాలు
భవన నిర్మాణాల్లో సృజనాత్మకత, సాంకేతికత మేళవింపుతో కమర్షియల్ కాంప్లెక్స్/రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్/ఆఫీస్ ప్రిమిసెస్/ ఇంటి లోపలి భాగాలను అందంగా తీర్చిదిద్దే ఇంటీరియర్ డిజైనర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. దీంతో ఇంటీరియర్ డిజైనింగ్ బహుముఖ అవకాశాలకు వేదికగా నిలుస్తోంది. అందుబాటులో ఉన్న స్థలాన్ని వినియోగదారుని, అభిరుచికి అనుగుణంగా ప్రభావవంతంగా, అందంగా డిజైన్ను రూపొందించడమే ఇంటీరియర్ డిజైనర్ ప్రధాన విధి. ఇంటీరియర్ డిజైనింగ్కు సంబంధించి ఎన్నో స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి. రెసిడెన్షియల్ డిజైనింగ్లో భాగంగా కిచెన్, బాత్ రూమ్ డిజైన్, యునివర్సల్ డిజైన్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. కమర్షియుల్ ఇంటీరియర్ డిజైనింగ్ విషయానికొస్తే ఫర్నిచర్ డిజైన్, హెల్త్కేర్ డిజైన్, హాస్పిటాలిటీ డిజైన్, రీటైల్ డిజైన్, వర్క్స్పేస్ డిజైన్ వంటి స్పెషలైజేషన్లను ఎంచుకోవచ్చు.
ఇంటీరియర్ డిజైనింగ్‌లో ప్రత్యేక కోర్సులు
లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పుల కారణంగా ఒకప్పుడు నగరాలకు పరిమితమైన ఇంటీరియర్ డిజైన్ కాన్సెప్ట్. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకు సైతం విస్తరించింది. దీంతో ఇంటీరియర్ డిజైనర్లకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇంటీరియర్ డిజైన్ కోర్సులను పూర్తి చేస్తే పలు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీల్లో ఇంటీరియర్ డిజైనర్గా ఆకర్షణీయు వేతనంతో చక్కని ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇంటీరియర్ డిజైనర్లు కేవలం ఇళ్లు/రెసిడెన్షియల్ వ్యవహారాలకే పరిమితం కాకుండా కమర్షియల్ స్పేస్లో డిజైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ల్యాండ్స్కేప్, మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్, విజువల్ మార్కండైజింగ్, షో రూమ్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఎగ్జిబిషన్స్, హాస్పిటల్స్, క్లినిక్స్, ల్యాబ్స్, హాస్పిటాలిటీ కంపెనీలు, వెల్నెస్ సెంటర్లు, ఇండస్ట్రీయల్ కాంప్లెక్స్ వంటి నిర్మాణాల్లో అందుబాటులోని స్థలాన్ని ప్రభావవంతంగా తీర్చిదిద్దడంలో ఇంటీరియర్ డిజైనర్స్ పాత్ర కీలకంగా ఉంటోంది.
క్రియేటివిటీకి పెద్దపీట
ఫ్యాషన్, గ్లామర్, పెయింటింగ్, క్రియేటివిటీ వంటి నైపుణ్యాలపై పట్టు కలిగి ఉంటారో వారి ఊహాత్మక ప్రపంచాన్ని ఇంటీరియర్ డిజైనింగ్లో ఆచరణలో పెట్టుకోవచ్చు. ఇంటీరియర్ డిజైన్ అనేది చాలా పెద్దది. ఎన్నోసబ్గ్రూపులను కలిగి ఉంటుంది. అందులో అడ్వాన్స్డ్ కార్పెంటరీ, ఫ్యాబ్రికేషన్, యాంటిక్ ఫర్నీచర్, ఫ్లోరింగ్, ఫర్నీషింగ్, బేస్మెంట్, సీలింగ్, రీమోడలింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్స్ తదితర విభాగాలు చాలా ఉంటాయి. అయితే ఈ రంగంలో మీరు ముందుగా మీ వినియోగదారుల అవసరాలు తెలుసుకోవాలి. ప్రారంభంలో కొత్త కస్టమర్లను గుర్తించడానికి కొంత ఇబ్బందిగానే ఉంటుంది. అయితే ఒక్కసారి ఈ రంగంలో క్లిక్ అయితే మాత్రం తిరుగుండదు. ఇందుకోసం మీరు నిపుణత కలిగిన సభ్యులను నియమించుకోవాలి. దీనికన్నా ముందుగా ఈ రంగంలో కొంతపెట్టుబడి (రెండు లేదా మూడు లక్షల రూపాయల వరకు) పెట్టాలి. ఒక చిన్నఆఫీసును ఏర్పాటు చేసుకుని, వాటి ఖర్చులను భరించేందుకు సిద్ధంగా ఉండాలి.
ఇంటీరియర్ డిజైనింగ్ వ్యాపారం కోం ఏమేమి చేయాలి?
మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్లో మీ కంపెనీ వివరాలను రిజిస్ట్రర్ చేయించుకోవాలి. ఇందులో పబ్లిక్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా లేదా భాగస్వామ్య సంస్థ లేదా సింగిల్ ఓనర్ కంపెనీనా అనే వివరాలను పొందుపర్చాలి. అయితే సోలో ప్రొప్రేటర్షిప్గా నమోదు చేసుకోవడం మంచిది. రిజిస్ట్రేషన్ సమయంలో మీ కంపెనీ పేరు, లోగో వివరాలను వివరంగా తెలియజేయాలి. ఈ రెండు మీ కంపెనీకి సరైన బ్రాండ్‌ను తీసుకొస్తాయి. కంపెనీ పేరు రిజిస్ట్రర్ చేసుకున్న తర్వాత మీ స్థానిక మున్సిపాలిటీలో ట్రేడ్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకోవాలి. అది కూడా తీసుకున్నాక మీ పాన్ నెంబర్ను జతచేసి ఒక కరెంట్ అకౌంట్ను ఓపెన్ చేయాలి. జిఎస్టి కూడా తీసుకోవాలి. అయితే ఈ జిఎస్టి మీ కంపెనీ నుండి లావాదేవీలు ప్రారంభమయ్యాక కూడా తీసుకోవచ్చు. వీటి కోసం మీరు శ్రమ పడకుండా ఎవరైనా కన్సల్టెన్సీ సహాయం తీసుకోవడం ఉత్తమం.
కస్టమర్లను ఆకట్టుకునేలా డిజైనింగ్ ఉండాలి
ముందుగా మీ దగ్గరికొచ్చే కస్టమర్లను మీరు ఆకర్షించాల్సి ఉంటుంది. చాలా మంది కస్టమర్లు వారికి కావాల్సిన డిజైన్ కోసం ఆన్లైన్లో అన్వేషిస్తుంటారు. కాబట్టి మీరు మీ కంపెనీ పేరు మీద ఒక వెబ్సైట్ను ముందే ఏర్పాటు చేసుకోవడం మంచింది. అందులో మీ కంపెనీ వివరాలను తెలియజేసి, మీరు ఇంతవరకు చేసిన డిజైన్లను, ఆకట్టుకునే ఫొటోలను, వీడియోలను ఆ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలి. వాటిని చూసిన కస్టమర్లు మిమ్మల్ని తప్పకుండా సంప్రదిస్తారు. మీ వ్యాపారం వృద్ధి కోసం ప్రారంభంలో మీరు కస్టమర్ల నుండి తక్కువ ఫీజు తీసుకోవడం ఉత్తమం. ఈ పనిలో మీరు నాణ్యతను పాటించి, కస్టమర్‌ను సంతృప్తిపరిస్తే మీ కంపెనీ త్వరగా అభివృద్ధి చెందుతుందని గుర్తుంచుకోండి. మీరు చేసిన పనులను సోషల్ మీడియా ద్వారా ప్రమోటింగ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఫేస్బుక్, ట్విట్టర్ వంటి వాటిలో ఆకర్షించే ఫొటోలను అప్లోడ్ చేయవచ్చు. అలాగే బ్లాగులలో కూడా మీ కంపెనీని ప్రమోట్ చేసుకోవచ్చు. దీని వలన మీ కంపెనీకి ఒక బ్రాండ్ ఇమేజ్ అన్నది ఏర్పడుతుంది. ఇవే కాకుండా ప్రింటి మీడియా, టీవీలల ద్వారా కూడా మీ కంపెనీని ప్రమోట్ చేసుకోవచ్చు. ట్రేడ్ ఈవెంట్స్లోనూ భాగస్వాములై మీ వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చు.
భవిష్యత్ అంతా ఇంటీరియర్ డిజైనింగ్ రంగానిదే!
ఇంటీరియర్ డిజైనర్ల వేతనాలు వ్యక్తిగత నైపుణ్యాలపై ఆధారపడి ఉంటాయి. ఈ విషయంలో అనుభవం కూడా ఎంతో ముఖ్యపాత్రను పోషిస్తుంది. నెల వారీగా తీసుకుంటే రిక్రూట్ చేసుకున్న కంపెనీని బట్టి నెలకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు లభిస్తుంది. అనుభవం ఆధారంగా నెలకు రూ. 50 వేల నుంచి రూ. 75 వేల వరకు పొందవచ్చు. స్వయం ఉపాధి దిశగా ఆలోచన చేస్తూ, సొంతంగా ఇంటీరియర్ డిజైన్ స్టూడియో/కన్సల్టెన్సీని ప్రారంభించవచ్చు. రెసిడెన్షియల్ ప్రాజెక్టుల విషయంలో సెల్ఫ్ ఎంప్లాయిడ్ డిజైనర్లు పని గంటల ఆధారంగా ఉంటుంది. దీనికి తగినవేతనం పొందుతారు. కొన్నిచోట్ల ఫర్నిచర్, లైటింగ్, ఆర్ట్వర్క్లతో పాటు ఇతర డిజైనింగ్ సామగ్రి మొత్తం విలువలో కొంత శాతాన్ని కూడా చెల్లించాలని కూడా కోరుతుంటారు. కవుర్షియల్ ప్రాజెక్టుల విషయంలో కొన్నిసార్లు పనిగంటలపై ఆధారపడి చెల్లింపులు ఉంటాయి. లేదా మొత్తం ప్రాజెక్టుకు గానూ కొంత ఫీజును ముందే చెల్లించాల్సి ఉంటుంది. అద్భుతమైన అవకాశాలు కలిగిన ఇంటీరియర్ రంగంలో భవిష్యత్‌ను వెతుక్కోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.